ఎయిర్ ఇండియా పట్ల ఆసక్తి చూపుతున్న టాటా 

నష్టాల లోబిలి ఇరుక్కుపోవడంతో నడపలేక ప్రైవేట్ వారికి అప్పగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్న ఎయిర్ ఇండియా ను తీసుకొని, నడపాలని టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.  వాస్తవానికి యుపిఎ హయాంలోనే విమాన రంగంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా టాటాలకు నాటి ప్రభుత్వం నుండి విముఖత ఎదురైనది. 
ఎయిర్ ఇండియాలో కేంద్రానికి ఉన్న 73 శాతం వాటాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్రం చూస్తున్నది. ఈ సందర్భంగా  ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటాలు ఆసక్తి కనబరుస్తున్నారనే కధనాలు వెలువడుతున్నాయి. మలేషియా సంస్థతో‌ కలసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఏషియా ద్వారా టాటా సన్స్..ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాఖలు చేసినట్టు చెబుతున్నారు.
అయితే ఎయిర్ ఇండియాపై అజమాయిషీ కోసం టాటాసన్స్‌తో  ఎయిర్ ఇండియా ఉద్యోగుల బృందం ఒకటి ఈఓఐ దాఖలు చేసినట్టు సమాచారం. తమ ప్రయత్నాల్లో ఓ ప్రముఖ ఆర్థిక సలహాదారు కూడా భాగమయ్యారని ఆ బృందం తెలిపింది. అంతే కాకుండా  బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్ జెట్ ఎమ్‌డీ అజయ్ సింగ్ కూడా ఎయిర్‌ ఇండియాపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి 2018లో కేంద్రం ఎయిర్ ఇండియా ప్రైవేటికరణకు ప్రయత్నించింది. కానీ ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అప్పట్లో సంస్థకు ఏకంగా రూ 62 వేల కోట్ల అప్పులు ఉండేవి. ఇంతటి రుణభారం తమకు బదిలీ అవుతుందనే భయం కారణంగా కార్పొరేట్ల నుంచి స్పందన కరువై ఉంటుందని అప్పట్లో మార్కెట్ వర్గాలు భావించాయి.
దీంతో కేంద్రం ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది.  సంస్థకు ఉన్న నికర అప్పులు రూ. 23,286 కోట్లకు తగ్గించింది. తాజాగా జనవరిలో రెండోసారి బిడ్లు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే టాటా సన్స్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఎయిర్ ఇండియాను టాటాలే ప్రారంభించారు. స్వాతంత్య్రంకు పూర్వమే టాటా ఎయిర్ లైన్స్‌ను జే.ఆర్.డీ టాటా ప్రారంభించారు.
అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత మెజారిటీ వాటాను కేంద్ర ప్రభుత్వం టాటాల నుంచి కొనుగోలు చేసింది. ఆ తరువాత జాతియ ప్రయోజనాల దృష్యా అప్పటి ప్రభుత్వం అనేక కీలక రంగాల్లోని ప్రైవేటు సంస్థలను జాతీయం చేసింది. ఈ క్రమంలోనే టాటా ఎయిర్‌లైన్స్ పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మారిపోయి  ఎయిర్ ఇండియాగా అవతరించింది.