ఏఓబీలో ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృతి 

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 
 
పోలీసుల కథనం ప్రకారం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా ఆంధ్రాఒడిశా సరిహద్దు కటాప్‌ ఏరియా ఎగజనభ ప్రాంతంలోని సింగారం అటవీ ప్రాంతంలో 30 మందిపైగా మావోయిస్టులు అగ్ర నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు ఒడిశా పోలీసు నిఘా విభాగానికి సమాచారం అందింది. 
 
దీంతో, ఒడిశా బిఎస్‌ఎఫ్‌, ఒఎస్‌జి, డివిఎఫ్‌ భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో వారికి ఎదురు పడ్డారు. దీంతో, మావోయిస్టులకు, పోలీసులకు మధ్య 40 నిమిషాల పాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. 
 
అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాల్పుల అనంతరం పోలీసు బలగాలు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెంది ఉన్నారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లా గంగులూరు గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లేష్‌ అలియాస్‌ మల్లన్న అలియాస్‌ సునీల్‌గా పోలీసులు గుర్తించారు. 
ఈ ఘటనలో మృతి చెందిన మహిళా మావోయిస్టు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఆమె ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గంగూలూరు గ్రామానికి చెందిన దళ సభ్యురాలు సొమిదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశా పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కిట్‌ బ్యాగులు లభ్యమైనట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు.
ఘటన జరిగిన ప్రాంతం విశాఖ జిల్లా సీలేరు, చింతపల్లి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అప్రమత్తమైన విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం ఎఒబిలోకి భారీగా బలగాలను దింపి కూంబింగ్‌ నిర్వహిస్తోంంది. ఈ సంఘటనతో మన్యంలో అలజడి నెలకొంది.