జనవరి 15 తర్వాత ఏపీలో కరోనా రెండో దశ!

ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టింనా జనవరి 15 తర్వాత రెండో దశ మరింత ఉధృతంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం  రోజుకు 500 నుంచి 600 మధ్య కేసులు నిర్ధారణ అవుతుండగా ఇద్దరు లేదా ముగ్గురు కరోనా కారణంగా మృతిచెందుతున్నారు. 

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండోసారి కరోనా వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని పేర్కొంది. 

చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని, రెండో దశను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.  పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దశ నుంచి ఐదు నెలల విరామం తర్వాత సెకండ్‌ వేవ్‌ వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే జరిగిందని నిపుణులు అంచనా వేశారు.

ఎపిలో ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య తీవ్రత ఎక్కువగా ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గిందని, తిరిగి ఐదు నెలల తర్వాత అంటే 2021 జనవరి 15 నుంచి మార్చి 15లోగా రెండో దశకు అవకాశాలున్నాయని నివేదిక హెచ్చరించింది. అయితే ఈ దశలో వైరస్‌ తీవ్రత ఎంతగా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని వివరించింది.

అయితే  ఎపిలో కచ్చితంగా తిరిగి వస్తుందని గానీ, రాదు అని గానీ చెప్పలేమని, వచ్చేందుకు అవకాశాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌ పరిస్థితులకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండటం మంచిదని, సెకండ్‌ వేవ్‌లో చాలా దేశాలు, రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారని నిపుణులు తెలిపారు.

కరోనా రెండో దశ అంచనాలపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో నియమించిన  ఓ నిపుణుల కమిటీ ఈ నివేదికను ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే నలుగురు, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు.