జేపీ నడ్డాకి కరోనా పాజిటివ్

జేపీ నడ్డాకి కరోనా పాజిటివ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ‘‘కరోనా ప్రాథమిక లక్షణాలు అని అనుమానం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించుకున్నా. నివేదికలో కరోనా పాజిటివ్ అని తేలింది” అని ఆయనే స్వయంగా ట్విటర్‌లో ఆదివారం సాయంత్రం వెల్లడించారు.

” ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సలహాలు, కరోనా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నాను. నాతో పాటు కాంటాక్ట్‌లోకి వచ్చిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.   
 
 కొన్నిరోజులు ఇంటి  నుంచే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు.  కాగా,  న‌డ్డా త్వ‌ర‌గా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాల‌ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఆకాంక్షించారు. ఈ స‌మ‌యంలో న‌డ్డాకు, వారి కుటుంబానికి త‌న ప్రార్థ‌న‌లు అని తెలిపారు.
 
కాగా, ‘గెట్‌ వెల్‌ సూన్‌ సర్‌’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు. నడ్డా త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్‌ వేదికగా ఆకాక్షించారు. ఇక పార్టీ సీనియర్‌ నేతలు హోంమంత్రి అమిత్‌ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ గత నెలలో కరోనాబారినపడి కోలుకున్నారు.  
ఇలా ఉండగా, గత నెలలో కోవ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకిన హర్యానా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ విజ్ ను మెరుగైన వైద్యం కోసం అంబాలా సివిల్ ఆసుపత్రి నుంచి  రోహతక్ నగరంలోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. 
 
కరోనా బారిని పడిన మంత్రి అనిల్ విజ్ కు రెమ్‌డెసివిర్‌తోపాటు ప్లాస్మాథెరపీ ఇవ్వాలని వైద్యనిపుణులు నిర్ణయించారు. రెమ్‌డెసివిర్‌ ఇవ్వడంతో మంత్రి అనిల్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.
 
గత నెలలో హర్యానాలో మూడవ దశ కోవాక్సిన్ ట్రయల్సులో అంబాలాలోని ఒక ఆసుపత్రిలో మంత్రి అనిల్ విజ్ కు కోవాక్సిన్ ట్రయల్ డోస్ ఇచ్చారు. మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏర్పడటానికి 14 రోజులు పడుతుందని, కాని తనకు కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదు మాత్రేమే తీసుకున్నానని మంత్రి విజ్ ట్వీట్ చేశారు. 
బీహార్ లో హిందూస్థానీ అవాం మోర్చా (హెచ్ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీకి కరోనా పాజిటివ్ అని సోమవారం తేలింది. జితిన్ రాం మాంఝీ ఆదివారం తన స్వగృహంలో హిందూస్థానీ అవాం మోర్చా జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జితిన్ రాంకు పరీక్ష చేయగా సోమవారం ఉదయం కొవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. 
 
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ నగరంలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఉద్యోగులకు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు ఆలయాన్ని మూసివేశారు. గురువాయూర్ ఆలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా కరోనా ప్రబలకుండా గురువాయూర్ దేవస్థానాన్ని రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహణ కమిటీ ప్రకటించింది.
కాగా, దేశంలో కరో నా కేసులు కోటికి చేరువవుతున్నాయి. శనివారం మరో 30,254 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం కేసుల సం ఖ్య 98,57,029కి చేరి.. కోటికి కూతవేటు దూరంలో నిలిచింది. అలాగే, 24 గంటల్లో మొత్తం 391 మంది మృత్యువాత పడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,43,019కి పెరిగింది.