ప్రజలపై కుటుంబ నియంత్రణను నిర్బంధంగా రుద్దడానికి తాము వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిల్లల్ని కనడంపై నిర్బంధ ఆదేశాలు ఇస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని, జనాభా అసమానతలకు దారి తీస్తుందని పేర్కొంది.
మన దేశంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమం స్వభావ రీత్యా స్వచ్ఛందంగా పాటించవలసినదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. కుటుంబం పరిమాణం గురించి నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దంపతులు తమకు తగిన కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించవచ్చునని తెలిపింది. ఈ విషయంలో ఎటువంటి నిర్బంధం లేకుండా ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించింది.
బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ను సమర్పించింది. పెరుగుతున్న దేశ జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిల్ దాఖలు చేశారు.
దీనిపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ప్రజారోగ్యం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపింది. సామాన్యులను ఆరోగ్య సంబంధిత ప్రమాదాల నుంచి కాపాడటం కోసం ఆరోగ్య రంగంలో సంస్కరణలను తగిన రీతిలో, సుస్థిరమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని తెలిపింది.
ఆరోగ్య రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు నాయకత్వం వహించాలని పేర్కొంది. ఆరోగ్య రంగంలో రాష్ట్రాల నేతృత్వంలో జరిగే సంస్కరణల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది. మన దేశం సమగ్రమైన జాతీయ జనాభా విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొంది. ఈ విధానంలో లక్ష్యాలు, ఆపరేషనల్ స్ట్రాటజీలు వివరంగా ఉన్నాయని పేర్కొంది.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్