అక్టోబ‌ర్ నాటికి దేశంలో అంద‌రికీ వ్యాక్సిన్‌!

వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని,   దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ క‌ల్లా వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అద‌ర్ పూనావాలా తెలిపారు. 
 
ది ఎక‌నమిక్ టైమ్స్ గ్లోబ‌ల్ బిజినెస్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ ఈ నెలాఖ‌రు నాటికి త‌మ సంస్థ వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
 
వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నాటికి దేశంలోని అంద‌రికీ సరిప‌డా వ్యాక్సిన్ డోసులు ల‌భ్య‌మై, క‌రోనా మునుప‌టి రోజులు సాధ్య‌మ‌వుతాయ‌ని అద‌ర్ పూనావాలా చెప్పారు. దేశం మొత్తంలో 20శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తే సెప్టెంబర్ – అక్టోబర్ నాటికి  సాధారణ జీవితం పొందగలుగుతామని పేర్కొన్నారు.
 
మ‌రోవైపు వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కోసం మూడు సంస్థ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయ‌ని, వాటి స‌మ‌ర్థ‌త‌, భ‌ద్ర‌త ప‌రిశీలించిన త‌ర్వాత డ్ర‌గ్ రెగ్యులేట‌ర్‌ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇస్తుంద‌ని నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పాల్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే దీనిపై ఓ నిర్ణ‌యం వెలువడుతుంద‌ని ఈ సందర్భంగా ఆయ‌న చెప్పారు.