కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి., హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి నవ భారత నిర్మాణంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అనేక ఆరోగ్య సంరక్షణ పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఐదు లక్షల ఆరోగ్య భీమా సదుపాయం గల ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప పథకం అని చెబుతూ దీని ద్వారా దేశంలో ఎక్కడయినా కార్పొరేట్ వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.మార్కెట్ ధర కంటే, 50% నుండి 90% తక్కువ ఖర్చుతో ఔషధాలను అంధించే జన ఔషధీ కేంద్రాల వ్యవస్థ, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, మిషన్ ఇంధ్ర దనుష్ మొదలైన పథకాలు ప్రజలకు గొప్ప వరమని మంత్రి చెప్పారు.
పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తరువాత అనేక సార్లు ఈ.ఎస్. ఐ ఆసుపత్రి ని సందర్శించానని, కోవిడ్ మహమ్మారి వ్యాపించిన పరిస్థితుల్లో కూడా ఈ కళాశాలలో ప్రత్యేక వార్డులను ప్రారంభించానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
ఇక్కడ వైద్య కళాశాలకు అనుబంధంగా అధునాతన వసతులు ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి ఉండటం వల్ల, ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులు, వివిధ రకాల వైద్యం కోసం వచ్చే రోగులను, చదువుకునే సమయంలోనే పరీక్షించి, విస్తృతమైన పరిజ్ఞానం పొందేందుకు అవకాశం లభించడం గొప్ప విషయమని మంత్రి ప్రశంసించారు.
దేశంలోనే ఈ.ఎస్.ఐ. ఆసుపత్రులలో ఎం బి బి ఎస్, పి జి, పి జి సూపర్ స్పెషాలిటీ కోర్సులను ఏకైక వైద్య కళాశాలగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ.ఎస్.ఐ. సంస్థ దేశ వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఈ.ఎస్.ఐ భీమా లబ్ధిదారులకు సేవలందిస్తున్నదని పేర్కొన్నారు.
మన ఈ.ఎస్.ఐ. వైద్య కళాశాలలో ఇంకా నాలుగు కొత్త వైద్య పరికరాలను అందుబాటులోకి తేవడం సంతోషకరమని, దీనితో వైద్య సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
2019 సంవత్సరానికి గాను ఇఎస్ఐ కార్పొరేషన్ నడిపిస్తున్న సంస్థల్లో ఉత్తమ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు ఉత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డును కూడా అందుకుందని అభినందించారు. రోగుల సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వంటి అన్ని రంగాలలో వైద్య కళాశాల ప్రారంభమైనప్పటి నుండి అద్భుతమైన పురోగతి సాధించిందని కిషన్ రెడ్డి కొనియాడారు.
శనివారం ప్రారంభించిన నాలుగు పరికరాల్లో ఇన్నోవేటివ్ పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ (ఆర్ టి పి సి ఆర్) రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టం, కోవిడ్ సేఫ్ ఇంకుబెటర్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్ ఇంకా రౌండ్ ది క్లాక్ ఇన్ హౌజ్ డయాలసిస్ సర్వీస్ లు, రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు అందించడానికి ఎంతో ఉపయోగకరమని కిషన్ రెడ్డి వివరించారు.
ఐపీ (భీమా పొందిన వ్యక్తి) ని వీఐపీ గా భావించి చికిత్స చేయడంతో పాటు ఈ సంస్థ లోని అభివృద్ధి చేసిన అత్యాధునిక సౌకర్యాలతో బయటి ఆసుపత్రులకు రిఫరెల్స్ బాగా తగ్గాయని చెప్పారు. ఇక్కడ ప్రారంబించిన మొట్ట మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ద్వారా ఇప్పటివరకు సుమారు 80 వేల నమూనాలను పరీక్షించడం గొప్ప విషయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

More Stories
సింగరేణిలో సంస్కరణాలకై ఓ ప్రత్యేక కమిటీ
భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రమాణాల రభస.. బీజేపీ శుద్ధి
విశ్వశాంతి స్థాపనలో ప్రధాని మోదీ ఏకైక ఆశాకిరణం