వరుసగా కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమాలోచనలు 

మూడు రోజుల పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. మొదటి రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా,  గజేంద్ర షెకావత్‌ లతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్ వరదలు, ఆకాల వర్షాల సమయంలో విపత్తు నిర్వహణ కింద రావాల్సిన నిధులు, కేంద్ర హోంశాఖ నుంచి పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాలపై సిఎం కెసిఆర్ అమిత్‌షాతో ప్రస్తావించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వరదలకు పాడైన రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా అమిత్‌షాతో సిఎం చర్చించినట్లు సమాచారం. 
 
అంతకుముందు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో దాదాపు గంటపాటు భేటీ అయిన సిఎం రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం.
 
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్‌సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్‌లతో కూడా కేసీఆర్ ఈ పర్యటనలోసమావేశమయ్యే అవకాశం ఉంది. 
 
ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని సిఎం కెసిఆర్ పరిశీలించిన శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు.