
డిజిటైజేషన్‌లో భాగంగా వచ్చే ఏడాది నుంచే ఓటర్ ఐడీ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు భారత ఎన్నికల కమీషన్ (ఈసీఐ) చేస్తున్నది. ప్రస్తుతం ఇ-ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో అప్పుడు ఓటర్ ఐడీలను కూడా అలాగే చేసుకునే వీలు కలుగుతుంది.
వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే డిజిటల్ ఓటర్ ఐడీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల కమీషన్ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఓటు హక్కు కోసం ఎన్‌రోల్ చేసుకున్న వారికి నేరుగా ఈ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పటికే ఓటర్ ఐడీలు ఉన్న వాళ్లు మాత్రం ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో కొన్ని లాంచనాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీని సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వనుంది. డౌన్‌లోడ్ చేసుకునే వీలున్న ఓటర్ ఐడీలతోపాటు ప్రస్తుతం ఉన్న ఎపిక్ కార్డులు కూడా కొనసాగుతాయి. సులభంగా ఓటర్ ఐడీలను ఓటర్లకు చేర్చే ఉద్దేశంతోనే ఇలా డిజిటల్ ఐడీలను తీసుకొస్తున్నారు.
కొత్తగా ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్లు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ద్వారా ఐడీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కార్డుపై రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఒకదాంట్లో ఓటరు పేరు, ఇతర వివరాలు ఉంటాయి. మరో దానిలో ఓటర్‌కు సంబంధించిన ప్రత్యేకమైన సమాచారం ఉంటుంది.
ఈ క్యూఆర్ కోడ్లలోనే డేటా ప్రకారమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ సేవలు అందుబాటులోకి వస్తే సర్వీస్ ఓటర్లు, విదేశాల్లోని ఓటర్లు కూడా తమ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీరికి భౌతికంగా ఓటర్ ఐడీ కార్డులు లేవు. ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్‌కు షిప్ట్ అయిన ఓటర్లు, తమ కార్డు కోల్పోయిన వాళ్లు కూడా దీని ద్వారా సులభంగా తమ ఐడీని మార్చుకోవచ్చు.
More Stories
సిక్కింని ముంచెత్తిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గంట వ్యవధిలో నేపాల్ నుండి నాలుగు భూకంపాలు
41 మంది కెనడా దౌత్యవేత్తలకు దేశం వదిలి వెళ్ళమని ఆదేశం