నడ్డాపై దాడి …. గవర్నర్ నివేదిక కోరిన అమిత్ షా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌‌లో జరిగిన దాడిపై దర్యాప్తుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సవివరమైన నివేదికను సమర్పించాలని గవర్నర్‌ను కోరారు.

జేపీ నడ్డాపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమిత్ షా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. టీఎంసీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ నిరంకుశ పాలనలో ఉందని ఆరోపించారు. ఈ పరిణామాలు శోచనీయమని పేర్కొన్నారు. 

ఈ సంఘటనను తాము ఎంతగా ఖండిస్తున్నామో అది తక్కువ అని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని చాలా తీవ్రంగా తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి హెచ్చరించారు. శాంతిని ప్రేమించే రాష్ట్ర ప్రజలకు స్పాన్సర్ చేసిన హింసాకాండపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కూడా మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని తాను అప్రమత్తం చేసినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

సౌత్ 24 పరగణాస్‌లోని డైమండ్ హార్బర్‌లో బీజేపీ సమావేశం సందర్భంగా శాంతిభద్రతలు కుప్పకూలే అవకాశం ఉందని తాను గురువారం ఉదయం 8.19 గంటలకు, 9.05 గంటలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు. 

కాగా, టీఎంసీ నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్‌ కారు ఉంది కాబట్టే  ఆయన బతికి బయట పడ్డారని పేర్కొన్నారు.ఈ  ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

జేపీ నడ్డాపై దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షు, కేంద్రంలో అధికారంలో పార్టీకి సారధి అయిన నడ్డా కాన్వాయిపై రాళ్లు రువ్వడం పశ్చిం బెంగాల్‌లో శాంతిభద్రతు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో రుజువు చేస్తోందని విమర్శించారు.

 బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌, జాతీయ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కలిసి బీజేపీ పైన ఇటువంటి దాడులు నిర్వహించి కార్యకర్తలను చిత్రహింసకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ కార్యకర్తలు బయపడరని స్పష్టం చేశారు.