ధరణి కన్నా అత్యుత్తమం కేంద్ర ప్రభుత్వ స్వామిత్వ

ధరణి కన్నా అత్యుత్తమం కేంద్ర ప్రభుత్వ స్వామిత్వ
భూమి హక్కులను డిజిటల్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణి కన్నా అత్యుత్తమంగా కేంద్ర ప్రభుత్వం సౌమిత్వ పథకంను అమలు పరచనున్నది. దీని ద్వారా గ్రామాలలోని ఇండ్లకు పక్క హక్కులు దాఖలు చేయనున్నది. ఇందుకోసం ఆరు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.
తొలిసారిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే దిశగా ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వ)’ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలో జరుగుతున్న ధరణి ఆస్తుల సర్వే మాదిరిగా పైపై వివరాల సేకరణ కాకుండా ఆస్తులను సమగ్రంగా సర్వే చేయడం, విస్తీర్ణాన్ని, యాజమాన్యాన్ని నిర్ధారించి కార్డులు జారీ చేస్తారు.
ఈ కార్డుల సాయంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి వీలుంటుంది. ప్రస్తుతం హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వచ్చే నాలుగేండ్లలో ద‌‌శ‌‌లవారీగా  దేశ‌‌మంత‌‌టా అమ‌‌లు చేయ‌‌నున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఇండ్ల యజమానులకు ఇంటి పన్ను చెల్లించిన రశీదులు తప్ప మరే రకమైన హక్కు పత్రాలు అందుబాటులో  లేవు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలన్నా, లేదా ఇంకా ఏదైనా అవసరాలకు ఆ ఇంటి కాగితాలను పెట్టి ఋణం తీసుకోవాలన్నా వీలు కావడం లేదు. కేవలం పట్టణాల్లోని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ ఈ ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ కార్డులను జారీ చేస్తోంది. ఇన్నాళ్లు ఈ‌‌‌‌‌‌– పంచాయతీ పోర్టల్లో ఉన్న ఇండ్ల డేటాకు మరికొంత సమాచారం జోడించి ధరణి పోర్టల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అప్ లోడ్ చేసింది. కానీ,  ఇంటి విస్తీర్ణానికి సంబంధించి కచ్చితమైన కొలతలు, మొత్తం ఊరిలోని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు ఇందులో లేవు. ఇప్పుడు  సమగ్ర హక్కుల రికార్డుగా స్వామిత్వ కార్డును కేంద్రం రూపొందిస్తున్నది.
ముందుగా ఆయా రాష్ట్రాలు సర్వే ఆఫ్ ఇండియాతో ఎంవోయూ చేసుకున్నాక సర్వే చేయాల్సిన జిల్లాలు, గ్రామాలు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత డ్రోన్ ద్వారా ఫొటోలు తీసి, ఆ డేటాను ప్రాసెస్ చేసి లార్జ్ స్కేల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల విస్తీర్ణాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత ఇండ్ల హద్దులు, ఆబాదీ (నివాస స్థలాలు)  ఏరియా హద్దులు గుర్తించడం చేస్తారు.
పూర్తి స్థాయిలో విచారణ జరిపి సర్వేతో లింక్ చేస్తారు. ఆ తర్వాత రికార్డును రూపొందించి స్వామిత్వ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డులకు హర్యానాలో  ‘టైటిల్ డీడ్’గా, కర్ణాటకలో ‘రూర‌‌ల్ ప్రాప‌‌ర్టీ ఓన‌‌ర్‌‌షిప్ రికార్డ్స్‌‌(ఆర్పీఓఆర్)’గా,  మధ్యప్రదేశ్లో ‘అధికార్ అభిలేఖ్’గా, మ‌‌హారాష్ట్ర లో ‘స‌‌న్నద్’గా, ఉత్తరాఖండ్ లో ‘స్వామిత్వ అభిలేఖ్’ గా, ఉత్తర్ ప్రదేశ్ లో  ‘ఘ‌‌రావుని’గా పేర్లు పెట్టారు. 
 
అయితే ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ను సమగ్ర సర్వే చేపట్టి, ఆ వివరాలు నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుని బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.