కలసి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పూర్తిచేద్దాం

దేశ ప్రజలందరూ కలసి కొత్త పార్లమెంట్  భవన నిర్మాణాన్ని పూర్తి చేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. నూతన పార్లమెంట్ భవనం శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటూ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవమైన ఈ రోజు దేశ చరిత్రలో అజరామరమని ప్రధాని చెప్పారు. 

దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే వేళ  కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడం చాలా మంచి విషయమని ప్రధాని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయులకు ఈ రోజు గర్వకారణమని, ఈ నిర్మాణం కొత్త, పాత అస్థిత్వాలను అనుసంధానం చేసే రోజుగా వ్యాఖ్యానించారు. 

సమయంతోపాటు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని చెబుతూ 2014లో ఒక ఎంపీగా పార్లమెంట్ భవన్‌లో అడుగుపెట్టినప్పుడు, తల వంచి నమస్కరించి లోపలికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ‘కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ సమయంలో దేశ హితం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలి. ఈ దిశగా అనుభవ మండపం మనల్ని ప్రేరేపిస్తోంది. అనుభవ మండపం అనేది ప్రజాస్వామ్యంలో ఓ భాగంగా ఉండేది’ అని తెలిపారు. 

పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రనంతరం మన దేశానికి నూతన దిశను నిర్దేశించిందని ప్రధాని పేర్కొన్నారు. నూతన భవనం ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’ సృష్టికి సాక్షిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ అవసరాలను తీర్చే కృషి పాత భవనంలో జరిగిందని చెబుతూ  నూతన భవనంలో 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలు సాకారమవుతాయని భరోసా వ్యక్తం చేశారు.    

మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా పురాతమనమైందని పేర్కొంటూ  అందుకు చోళుల పరిపాలనను సూచించే కొన్ని శాసనాలను ఉదాహరణగా చెప్పొచ్చని తెలిపారు.  తమిళనాడులో చెన్నైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉత్తరా మెరూర్ అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలో చోళ సామ్రాజ్యానికి సంబంధించి 10వ శతాబ్దంలో పాలించిన తీరును సూచించే శాసనాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. 

వీటి ప్రకారం  అప్పట్లో చోళుల పాలనలో ప్రతి ఊరును కుడుంబులుగా విభజించేవారు. కుటుంబులను ఇప్పటి వ్యవహారంలో వార్డులుగా చెప్పొచ్చు. దీన్ని బట్టి వెయ్యేళ్ల కిందే మన దేశంలో ప్రజాస్వామ్య పాలనను చూడొచ్చు. మన దేశంలో చాలా చోట్ల ప్రజాస్వామ్య ఆనవాళ్లను చూడొచ్చుని ప్రధాని వివరించారు. 

సభ, సమితి, గణపతి, గణాధిపతి ఇలాంటి పదాలు వందల ఏళ్లుగా మన వ్యవస్థలో చిరపరిచితంగా ఉన్నాయని మోదీ తెలిపారు. రుగ్వేదంలో ప్రజాస్వామ్యాన్ని సమజ్ఞానంగా అభివర్ణించడాన్ని గమనించొచ్చని చెప్పారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని ఓ సంస్కారంగా, జీవన పద్ధతిగా, జీవన ఆత్మగా, తత్వంగా, మంత్రంగా, తంత్రంగా చూడాలని సూచించారు. దేశంలో సమయం మారినా, ప్రక్రియలు మారిన ఆత్మ మాత్రం ప్రజాస్వామమే అని ప్రధాని స్పష్టం చేశారు. 

ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్  హరివంశ్  నారాయణసింగ్, మంత్రులు హర్దీప్ సింగ్ పురి, నిర్మలా సీతారామన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.