జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి..తప్పిన ప్రమాదం

పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చిన  బీజేపీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డా కాన్వాయ్ పే ప్రత్యర్ధులు రాళ్లదాడి జరిపారు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉండటంతో క్షేమంగా బయటపడ్డారు. బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడ్డారు. వీరంతా కోల్‌కతాకు సమీపంలోని సౌత్ 24 పరగణాస్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. 

కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన రాళ్ల దాడిన విజయ వర్గీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోనుబట్టి బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కార్లపై ఇటుకలు, రాళ్ళతో దాడి జరిగినట్లు కనిపించింది. కార్ల అద్దాలు పగిలిపోవడం కనిపించింది. ఈ దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడినట్లు జేపీ నడ్డా విలేకర్లకు చెప్పారు. 

ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని నడ్డా ఆరోపించారు. తమ కాన్వాయ్‌లోని అన్ని కార్లపైనా దాడి జరిగిందని పేర్కొన్నారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించడం వల్ల సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.  పశ్చిమ బెంగాల్‌లో అరాచక, అసహన పరిస్థితులకు తెరపడాలని స్పష్టం చేశారు. ‘‘నేను సమావేశానికి రాగలిగానంటే, అది కేవలం దుర్గా మాత దయ వల్లనే’’ అని జేపీ నడ్డా తెలిపారు. 

కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ఈ దాడిలో తాను గాయపడ్డానని పేర్కొన్నారు. జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కారుపై కూడా దాడి జరిగిందని చెప్పారు. ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై దాడి చేశారని ధ్వజమెత్తారు. మేము మన దేశంలోనే ఉన్నామా? అనే భావన తమకు కలిగిందని చెప్పారు. 

బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు  దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్ళతో నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారని మండిపడ్డారు. నడ్డాకు జెడ్-కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దాడి జరుగుతున్నపుడు పోలీసులు ప్రేక్షకుల్లా చూశారని ఆరోపిం

కాగా, మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడికి దిగారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ధ్వజమెత్తారు. నడ్డా కారుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా బెంగాల్ కానీ దేశం కానీ ఈ చర్యను ఎంత మాత్రం సహించదని స్పష్టం చేశారు. 

‘‘పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఇవే చివరి రోజులు. ఓటమి అంచున ఉన్నామని వారికి తెలిసిపోయింది. దీనిని జీర్ణించుకోలేకే దాడులకు దిగుతున్నారు. ఈరోజు నడ్డా కారుపై జరిగిన దాడి కూడా అదే కోవలోకి వస్తుంది. అయినప్పటికీ బీజేపీ ఏమాత్రం భయపడదు’’ అని చౌహాన్ మండిపడ్డారు.