వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ కు కుమారస్వామి సలహా 

కాంగ్రెస్‌తో సర్వం కోల్పోయానని సంచలన వ్యాఖ్యలు చేసిన జేడీఎస్ నేత కుమార స్వామి మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ విమర్శిస్తోందని, వాటికి ప్రత్యామ్నాయాలను మాత్రం చూపడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. 
 
కాంగ్రెస్ ఎంత సేపటికీ బిల్లులను విమర్శిస్తోందని, ఒక్క ప్రత్యామ్నాయాన్నైనా చూపించిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ బిల్లుల్లోని కొన్ని అంశాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, అయితే తాము ఆ అంశాలకు ప్రత్యామ్నాయ అంశాలను కూడా పేర్కొన్నామని ఆయన తెలిపారు. 
 
ఈ విషయంలో ప్రతిపక్షం పాత్ర చాలా చిన్నదని, అయినా తాము సూచించిన వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతను చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 
 
 కాగా, రైతులే తమకు దేవుళ్లని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మోదీ తెచ్చిన పెద్ద విప్లవమని కొనియాడారు. విపక్షాల పాలనలో రైతుల కోసం ఏమీ చేయలేదని మండిపడ్డారు. 
 
రైతులను దివాళా తీసిన వారే నేడు రాష్ట్రపతిని కలవడానికి సమాయత్తమవుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని, రైతులు వారిని దూరంగా పెట్టారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రైతులకు క్షమాపణలు చెప్పాలని, రైతుల దుస్థితికి ప్రతిపక్షాలే జవాబుదారీ అని మండిపడ్డారు. 
 
రైతులచే తిరస్కరించబడిన ప్రతిపక్షాలే ఇప్పుడు రైతుల శ్రేయోభిలాషులుగా నటిస్తున్నాయని ధ్వజమెత్తారు. వారి మోసాన్ని ప్రజలు గుర్తించారని హెచ్చరించారు. రైతులందరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. భారత్ బంద్‌ను నిర్వీర్యం చేసిన మధ్యప్రదేశ్ రైతులకు శివరాజ్ ధన్యవాదాలు ప్రకటించారు.