రాజస్థాన్  స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఘన విజయం  

రాజస్థాన్ లో స్థానిక సంస్థలకు జరిగిన  ఎన్నికల్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 21 జిల్లాల్లో జరిగిన పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. 

మొత్తం 4371 స్థానాలు ఉండగా, బిజెపి 1989 స్థానాలు గెలుపొందగా రాష్ట్రంలో అధికారమలో ఉన్న కాంగ్రెస్ 1852 మాత్రమే గెలుపొందింది. స్వతంత్రులు 439 స్థానాలు గెలుపొందగా, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ 60, సిపియం 26, బీఎస్పీ 5 స్థానాలు చొప్పున గెలుపొందాయి. 

అలాగే 636 జిల్లా పరిషత్ సీట్లలో ప్రతిపక్ష బీజేపీ 266 స్థానాలను కైవసం చేసుకోగా, అధికార పక్షమైన కాంగ్రెస్ 204 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆందోళనను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రక్కనే ఉన్న రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  హర్షం ప్రకటించారు.

‘‘స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మహిళలు రైతులు, గ్రామీణులు బీజేపీపై విశ్వాసం ప్రకటించారు. ప్రధాని మోదీపై కూడా విశ్వాసం ప్రకటించారు. వారందరికీ ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.  గ్రామీణులు, పేదలు, రైతులు, ప్రధానిపై విశ్వాసం ప్రకటించారన్న సంకేతాలు ఈ ఫలితాల ద్వారా వెలువడ్డాయని ఆ ట్వీట్ లో నడ్డా పేర్కొన్నారు.