ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనకు రూ.22 వేల కోట్లు

ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజనకు రూ.22 వేల కోట్లు

 కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలైన అష్ట దిగ్బంధనం వల్ల వ్యాపార సంస్థలు, ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఉద్యోగులను నియమించుకునే విధంగా వ్యాపార సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.22,810 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ విలేకర్లకు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళపాటు రిటైర్‌మెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూషన్‌ను అందజేస్తుందని తెలిపారు.

 వ్యాపార సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే, ఆ కొత్త ఉద్యోగులు, యజమానుల కంట్రిబ్యూషన్‌ను రెండేళ్ళపాటు ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం 2023 వరకు అమలవుతుందని చెప్పారు. దీనివల్ల 58.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించారు. 

2020 అక్టోబరు 1 నుంచి 2021 జూన్ 30 వరకు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే ఈ పథకం వర్తిస్తుంది. ఈ కొత్త ఉద్యోగులు తమ నెలసరి వేతనంలో ఉద్యోగుల భవిష్య నిధికి చెల్లించవలసిన కంట్రిబ్యూషన్ 12 శాతం, అదేవిధంగా యజమానులు చెల్లించవలసిన 12 శాతం, మొత్తం 24 శాతం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

గరిష్ఠంగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. 1,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు యజమానులు చెల్లించవలసిన 12 శాతాన్ని ప్రభుత్వం చెల్లించదు, కేవలం ఈ సంస్థల్లోని ఉద్యోగులు చెల్లించవలసిన 12 శాతాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.