ఏలూరులో పెరుగుతున్న రోగుల సంఖ్య 

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోన్న రోగుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం కలకలం రేపుతోంది. మంగళవారం సాయంత్రానికి కేసులు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ బుధవారం ఉదయం ఒక్కసారిగా కేసుల తాకిడి పెరిగింది. 
 
 తాజాగా వింత వ్యాధి బాధితుల సంఖ్య 585కి చేరింది. దాదా 503 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని  డిశ్చార్జ్ అయ్యారు.  పరిస్థితి సీరియస్‌గా ఉన్న 27 మందిని విజయవాడకు,  ఐదుగురిని గుంటూరుకు తరలించారు. పాత కేసులున్న ప్రాంతాలతోపాటు శంకరమఠం, తదితర ప్రాంతాల నుంచి కూడా కొత్తగా అంతుచిక్కని రోగ బాధితులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
 
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం మంగళవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వివరాలు అడిగి తెలుసుకుని వెనుదిరిగింది. ఈ బృందం బుధవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి. 
 
మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచిన 15 అంబులెన్స్‌లకు తోడు మరో 108 అంబులెన్స్‌లను కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి రప్పించి వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. 
 
దీనికితోడు మంగళగిరి నుంచి ఎయిమ్స్‌ బృందం బుధవారం ఉదయం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులను పరీక్షిస్తోంది. వారి ఆహారపు అలవాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. సాధారణ అనారోగ్యం, నీరసం, కార్తీక మాసం ఉపవాసాల వల్ల కొంతమంది కళ్లు తిరిగిపడిపోయినా అంతుచిక్కని రోగంగా ఆందోళన చెందుతున్నట్లు ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు గుర్తించారు. 
 
దీంతో సాధారణంగా కళ్లుతిరిగి పడిపోయారా ? మూర్ఛనే కారణమా ? అనేది తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక పరికరాన్ని హుటాహుటీన రప్పించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు న్యూరోసర్జన్‌ రవికుమార్‌ తెలిపారు. దీనివల్ల నిజంగా మూర్ఛకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
 
మరోవైపు వింత వ్యాధికి జల కాలుష్యమే కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  తాగునీరు స్వచ్ఛంగా ఉందని, రిపోర్టులన్నీ ‘నార్మల్‌’ వచ్చాయని అధికారులు తొలినుంచీ ప్రకటిస్తుండగా… అసలు సమస్య నీళ్లలోనే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఏలూరులో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో నీళ్లలో విష రసాయనాల అవశేషాలున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలినట్లు సమాచారం.