కేంద్రం లిఖిత పూర్వక ప్రతిపాదనలు .. రైతుల తిరస్కారం 

నూతన వ్యవసాయచట్టాల సవరణలకు సంబంధించిన లిఖిత పూర్వక ప్రతిపాదనలు బుధవారం కేంద్రం రైతు సంఘాలకు పంపింది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కొనసాగుతుందని ప్రభుత్వం అందులో పేర్కొంది. ఎంఎస్‌పిపైన రాతపూర్వక హామీకి కూడా ప్రభుత్వం అంగీకరించింది. 

విద్యుత్‌ (సవరణ) బిల్లు-2020 ప్రవేశపెట్టమని పేర్కొంది. విద్యుత్‌ పంపిణీ దారుల పర్యవేక్షణ ఈ చట్టాల ఉద్దేశమని ప్రభుత్వం వాదించింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం  ఎపిఎంసి, స్వేచ్ఛా మార్కెట్‌ మండీలు ఒకే పన్ను రేటును కలిగి ఉంటాయి. 

కార్పోరేట్‌లకు వ్యతిరేకంగా రైతు ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలని, లేదా సివిల్‌ కోర్టును ఆశ్రయించేలా చట్టాలను సవరిస్తామని తెలిపింది. వ్యాపారుల- రైతుల ఒప్పందంలో తలెత్తిన వివాద పరిష్కారంలో ఎస్‌డిఎంల అధికారాలను సవరిస్తామని ప్రతిపాదించింది. 

అంటే విక్రయాలపై ఫిర్యాదు చేసిన రైతులు స్థానిక ఎంస్‌డిఎంలను సంప్రదించాల్సివుంటుంది. ప్రైవేట్‌ కొనుగోలు దారులకు కూడా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసేలా సవరణలు చేస్తామని తెలిపింది. 

కాంట్రాక్ట్‌ వ్యవసాయంలో రైతు భూమికి ఎటువంటి హానీ ఉండదని, కాంట్రాక్టర్‌ రుణం తీసుకుంటే భూమి తనఖా పెట్టబడదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే భూమిపై రైతుల హక్కులనుకోల్పోకుండా అడ్డుకుంటామని తెలిపింది. 

పంట వ్యర్థాల దహనంపై పంజాబ్‌, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే నూతన వ్యవసాయచట్టాల్లో పంట వ్యర్థాల దగ్ధం చేసినందుకు భారీగా జరిమానాలు విధించబడతాయని పేర్కొంది.

అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి.  రైతులు ఆందోళ‌న విర‌మించేందుకు ఒప్పుకుంటే ప్ర‌స్తుత వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో 8 స‌వ‌ర‌ణ‌లు చేస్తామంటూ కేంద్ర స‌ర్కారు పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తిర‌స్కరించిన అనంత‌రం రైతులు సంఘాల నేత‌లు ఆందోళ‌నను మ‌రింత ఉధృతం చేసే విష‌య‌మై చ‌ర్చించారు. 

ఆ మేర‌కు ఆందోళ‌న‌ను ఉధృతం చేసే దిశ‌గా ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 12న (శ‌నివారం) ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా ర‌హ‌దారుల‌ను దిగ్బందించాల‌ని రైతుల‌కు రైతు సంఘాల నేత‌లు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల‌ 14న (సోమ‌వారం) దేశంలోని అన్ని బీజేపీ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

సెప్టెంబర్‌లో ఆమోదించిన కొత్త వ్యవసాయ చట్టాలు సంబంధించి రైతుల ఆందోళనలపై అవసరమైన అన్ని వివరణలను వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కేంద్రం తెలిపింది. 

కొత్త చట్టాలతో మండీలు బలహీనమవుతాయన్న రైతుల ఆందోళనను ప్రస్తావిస్తూ, మండీలకు వెలుపల కార్యకలాపాలు సాగిస్తున్న ట్రేడర్ల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేలా సవరణలు తేవచ్చని పేర్కొంది. పన్నులు, సెస్ విధించవచ్చని తెలిపింది.

‘రైతుల ఆందోళనలను ఎలాంటి అరమరికలు లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతుల పట్ల ఎంతో గౌరవభావంతో ఉంది. రైతు సంఘాలు తమ ఆందోళనను విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది’ అని రైతులకు లిఖిత పూర్వకంగా పంపిన ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది.

 వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ ద్వారా ఈ ప్రతిపాదనను ఆందోళనలు సాగిస్తున్న రైతులకు కేంద్రం అందజేసింది.