చైనాలో వీఘర్ ముస్లింలపై తీవ్రమైన అణచివేత   

చైనాలో అల్ప సంఖ్యాకులైన వీఘర్ ముస్లింలపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోంది. అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు వీఘర్లను కాపాడేందుకు కృషి చేస్తున్నప్పటికీ, చైనా ప్రభుత్వం నిరంకుశంగా వీరిని నిర్బంధిస్తోంది. తాజా నివేదిక ప్రకారం జింజియాంగ్ ప్రావిన్స్‌లోని వీఘర్ ముస్లింలను నిర్బంధించేందుకు టెక్నాలజీ, భారీ డేటా, సరికొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
 న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్‌డబ్ల్యూ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, వీఘర్ ముస్లింలను నిర్బంధించేందుకు చైనా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ జాయింట్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫాం (ఐజేఓపీ) అనే కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తోంది.
దీని ద్వారా డేటాను విశ్లేషించి, నిర్బంధించవలసిన మైనారిటీ కమ్యూనిటీ సభ్యులను ఎంపిక చేస్తోంది. చైనాలోని జింజియాంగ్ రీజియన్‌లో పోలీసింగ్ కోసం ఈ బిగ్ డేటా ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తోంది. ముఖ్యంగా టర్కిక్ ముస్లింలను ఎంపిక చేస్తోంది. లీక్ అయిన జాబితా ప్రకారం అక్సు ప్రిఫెక్చర్‌లో 2,000 మందికి పైగా నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడవుతోంది.
ముస్లింలను అణచివేసేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తుండటానికి ఇదే నిదర్శనం. ఖురాన్ చదవడం, మతపరమైన దుస్తులు ధరించడం, విదేశాలకు వెళ్ళడం వంటి కారణాలను చూపి నిర్బంధించవలసిన వ్యక్తులను ఎంపిక చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. 

హ్యూమన్ రైట్స్ వాచ్‌లో సీనియర్ చైనా రీసెర్చర్ మయ వాంగ్ మాట్లాడుతూ, టర్కిక్ ముస్లింలను చైనా కిరాతకంగా అణచివేయడం గురించి అక్సు ప్రిఫెక్చర్‌ లిస్ట్ వెల్లడిస్తోందన్నారు. ఈ జాబితా 2018నాటిదన్నారు. అణచివేత కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్న విషయం బయటపడిందని చెప్పారు. 

ఈ జాబితాలో ఉన్నవారి కుటుంబాలకు సమాధానం చెప్పవలసిన అవసరం చైనా ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. వీరిని ఎందుకు నిర్బంధించారు? వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అనే విషయాలను తెలియజేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణులు, మానవ హక్కుల మద్దతుదారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్‌లో సుమారు 10 లక్షల మంది వీఘర్ ముస్లింలను నిర్బంధించారు. 

ఇదిలావుండగా, శిబిరాల్లో వీఘర్ ముస్లింలను నిర్బంధించినట్లు వస్తున్న ఆరోపణలను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు ఈ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. స్థానికులను డీ రాడికలైజేషన్ చేయడానికి, ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం వంటివాటితో పోరాడటానికి ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.