ఆత్మనిర్భర భారత్ నమూనాగా నూతన పార్లమెంట్ భవనం 

నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన్ పక్కనే కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 
 
 దాదాపు వందేళ్ల క్రితం నిర్మాణమైన ప్రస్తుత పార్లమెంట్ భవనం మన దేశ వారసత్వ సంపద. ఆ వారసత్వ సంపదను ఎప్పటికీ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ,  భవిష్యత్తు అవసరాల కోసం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

భారత స్వతంత్ర వజ్రోత్సవాల నాటికి దేశ రాజధాని ఢిల్లీకి కొత్త కళరాబోతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి 2022 ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక హంగులతో, పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టబోతున్నారు.

ఆత్మ నిర్భర భారత్ ను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనం  కేవలం రాళ్లు, ఇటుకల నిర్మాణం కాదని, 130 కోట్ల భారతీయుల కలల సౌధమని ఆయన పేర్కొన్నారు.

కొత్త భవనంకు కిరీటంలా నాలుగు సింహాలు

కొత్త పార్లమెంట్ భవనంను టాటా ప్రాజెక్ట్ లిమిడెట్ కట్టబోతోంది. దీని నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ సెప్టెంబర్ నాటికే పూర్తయింది. రూ.861.9 కోట్లకు బిడ్ వేసిన టాటా ప్రాజెక్ట్స్ ఈ టెండర్ ను సొంతం చేసుకుంది. ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ మధ్య ఉన్న దాదాపు మూడు కిలోమీటర్ల ప్రాంతం  (సెంట్రల్ విస్టా) పునర్నిర్మాణంకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ భవనంకు పక్కనే కొత్త భవనాన్ని కట్టబోతున్నారు. 

దీని నిర్మాణ ప్లానింగ్, డిజైన్ ను అహ్మదాబాద్ కు చెందిన హెచ్​సీపీ డిజైన్ అనే అర్కిటెక్చర్ కంపెనీ అందిస్తోంది. కొత్త బిల్డింగ్ రెండు త్రికోణాలు ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండబోతోంది. 64,500 చదరపు మీటర్ల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనాన్ని కట్టనుంది టాటా. ఈ భవనంకు పైన కిరీటంలా నాలుగు సింహాల స్తంభం నిలిచి ఉంటుంది. మన దేశ వైవిధ్యమైన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లోపలి నిర్మాణం అంతా ఉండబోతోంది. 

ఈ నిర్మాణం  పనుల్లో మొత్తం 2 వేల మంది పని  చేస్తారు. దేశ నలుమూలల నుంచి ఎంతో పేరు ప్రతిష్టలున్న 200 మంది ఆర్టిస్టులు ఈ పనుల్లో పాలుపంచుకోబోతున్నారు. ఈ భవనం నిర్మాణం కోసం కేంద్రం కేటాయిస్తున్న మొత్తం రూ  971 కోట్లు. 

2010లోనే కొత్త భవన ప్రతిపాదన

ప్రస్తుత పార్లమెంట్ భవనంలో సౌకర్యాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విశాలంగా ఉండేలా కొత్త భవనం అవసరమని 2010లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. అప్పుటి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ప్రస్తుత భవనం  దేశ వారసత్వ సంపద అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా కొత్త భవనం నిర్మాణం చేసుకోవాలని ప్రతిపాదించారు. 

దీనిపై ఆ సమయంలో కమిటీ వేశారు. 2024లోపు కొత్త భవనంను  సిద్ధంగా చేసి ప్రస్తుత పార్లమెంట్ ను ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత పార్లమెంట్ కంటే దాదాపు 17 వేల చదరపు మీటర్ల ఎక్కువ విస్తీర్ణంలో 2022లోపు కొత్త బిల్డింగ్ పూర్తి చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్వదేశీ టెక్నాలజీ.. సకల సౌకర్యాలు

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ భవన  నిర్మాణం జరగబోతోంది. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా భవన నిర్మాణం ఉండబోతోంది. కొత్త భవనంలో మొత్తం 120 కార్యాలయాలు  ఉంటాయి. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్, ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల కార్యాలయాలతో పాటు రెండు సభల సచివాలయాలు, పార్లమెంటరీ కమిటీ కార్యాలయాలను ప్రత్యేక హంగులతో నిర్మిస్తారు. భారీ లైబ్రరీని నిర్మిస్తారు. 

పార్లమెంట్ కు 6 ప్రవేశాలు ఉంటాయి. రాష్ట్రపతి, ప్రధాని రాక కోసం అద్భుతమైన కళాకృతులతో తీర్చిదిద్దిన ప్రవేశ ద్వారం ఉంటుంది. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్ కోసం ఒకటి, ఎంపీలకు మరొకటి, మరో ప్రత్యేకమైన సెర్మోనియల్ ఎంట్రెన్స్ ఉంటాయి. మరో రెండు పబ్లిక్ ఎంట్రెన్స్ లు నిర్మించబోతున్నారు. 

ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ లో తొలి రెండు వరుసలో ఉండే బెంచీలకు మాత్రమే డెస్క్ ఉంటుంది. అయితే కొత్త భవనంలో  ప్రతి ఎంపీకి డెస్క్ ఉండనుంది. సభలో ఓటింగ్ జరిగినప్పుడు సభ్యుల అభిప్రాయం తెలిపేలా ప్రతి సీటు దగ్గర బయోమెట్రిక్ స్లాట్ పెడతారు. 

ప్రతి ఎంపీ మాట్లాడేది సభలో అందరికీ అర్థమయ్యేందుకు వాళ్లు కావాలనుకున్న భాష​లో వినేలా.. ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదం  చేసే డిజిటల్ వ్యవస్థను అమరుస్తారు. సభలో అవసరమైనప్పుడు వాడేందుకు వీలుగా పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు పెడతారు. ఇక ఎంపీల కోసం పక్కనే ఉన్న శ్రమ శక్తి భవన్ వద్ద అందరికీ కార్యాలయాలు  ఉండేలా మరో భవనం  కడతారు.

చౌసఠ్ యోగినీ టెంపుల్ రూపంలో ప్రస్తుత పార్లమెంట్

మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న కాలంలో తమ పాలనా రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత కొత్త చట్టసభను నిర్మించాలని 1921లో నిర్ణయించారు. పరిపాలన రాజధానిగా న్యూఢిల్లీ నిర్మాణానికి ప్లానింగ్ ఇచ్చిన ఆర్కిటెక్ట్స్ సర్ ఎడ్విన్ లూటెన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ లకే ఈ బాధ్యత కూడా అప్పగించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణం స్టార్ట్ చేసి, రూ.83 కోట్ల ఖర్చుతో ఆరేండ్లలో పూర్తి చేశారు. 

మధ్యప్రదేశ్ లోని 11వ శతాబ్ధం నాటి చౌసఠ్ యోగినీ దేవాలయంను స్ఫూర్తిగా తీసుకుని ఈ భవనాన్ని కట్టారు. 1927 జనవరి 18న నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ఆ భవనాన్ని ప్రారంభించారు. నాటి నుంచి 1947 వరకు బ్రిటిష్ భారత్ లో దీనిని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరుతో చట్టసభల నిర్వహణకు వాడుకున్నారు.

ఆ తర్వాత  స్వతంత్ర భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఏర్పడిన రాజ్యాంగ సభ కోసం ఇదే భవనాన్ని వినియోగించారు. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన నాటి నుంచి దీనిని పార్లమెంట్ గా వాడుకుంటున్నాం.

(వి6 వెలుగు కధనం నుండి)