భారత్‌లో వ్యాక్సిన్ వాడకానికి ఫైజర్ దరఖాస్తు

తాము తయారు చేసిన ఫైజర్ / బయోఎన్ టెక్ కొవిడ్19 ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ భారత ఔషధ నియంత్రణ జనరల్)ని ఫైజర్ ఇండియా కోరింది. 

ఈమేరకు ఈనెల 4 న సమర్పించిన ఫారం సిటి18 దరఖాస్తులో వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్ పరీక్షల నిర్వహణ అవసరాన్ని ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని కోరింది. భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. 

ఫైజర్ మాతృ సంస్థ ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్‌ల్లో ఇదే విధంగా ఆమోదాలు పొందిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి వచ్చేలా కేవలం ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు ఉంటాయని ఫైజర్ స్పష్టం చేసింది.

వీలైనంత త్వరగా వ్యాక్సిన్ భారత్‌కు అందచేస్తామని తెలియచేసింది. దేశీయంగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా మూడోదశలో ఉంది. అయితే ఈ ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌లో నిల్వ, పంపిణీ చేయాల్సి రావడం భారత్ వంటి దేశాలకు పెద్ద సవాలు. 

ముఖ్యంగా కోల్డ్ చైన్ సదుపాయాలు చిన్న పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేవు. అందువల్ల ఇదో కష్టతరమైన సమస్యగా అధికార యంత్రాంగం పేర్కొంటోంది.