చైనా నుండి తగ్గిన దిగుమతులు, పెరిగిన ఎగుమతులు 

గాల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు అడ్డుకొంటు 20 మంది భారత సైనికులు అమరులైన అనంతరం చైనా దిగుమతులపై భారత్ ఆంక్షలు విధిస్తుండడంతో ఈ ఏడాది చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గగా, మరోవైపు భారత్‌ నుంచి చైనాకు ఎగుమతులు పెరిగాయి. 
 
ఓ వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం, మరోవైపు తూర్పు లఢక్‌ సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ 11 నెలల్లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 16 శాతం పెరిగాయి. మరోవైపు అదే సమయంలో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 13 శాతం తగ్గాయి. 
 
ఈ మేరకు చైనా కస్టమ్స్‌ డేటా సోమవారం వెల్లడైంది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 59 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు చైనా నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది ఎగుమతులతో పోల్చితే 13 శాతం మేర తగ్గుదల నమోదైంది. 
మరోవైపు సరిహద్దు వివాదాన్ని చైనా రాజకీయం చేయకపోవడం వల్లనే భారత్‌ నుంచి చైనాకు 19 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని ఆ దేశ మీడియా వెల్లడించింది. గతంతో పోల్చితే భారత్‌కు ఎగుమతులు 16 శాతం పెరిగాయని తెలిపింది.
కాగా, కరోనా వల్ల భారత్‌లో అంతర్గత డిమాండ్‌ తగ్గడం, ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులు 13 శాతం తగ్గాయని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. చైనా నుంచి భారత్‌ ఎక్కువగా ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఎరువులు, యాంటీ బయోటిక్స్‌, అల్యుమినియం ఫోయిల్‌ను దిగుమతి చేసుకున్నది. మరోవైపు భారత్‌ నుంచి చైనాకు ముడి ఇనుము, ముడి డైమాండ్స్‌, కాటన్‌, గ్రానైట్‌ స్టోన్‌, చేపలు వంటివి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి.