ఎయిర్ ఇండియాను కొనేందుకు ఉద్యోగుల ఆసక్తి 

అప్పుల్లో చిక్కుకున్న ఎయిరిండియా విమానయాన సంస్థను ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతున్నారు. సంస్థను ముందుకు నడిపించేందుకు తలా రూ.లక్ష వేసుకుని ప్రభుత్వ బిడ్‌లో పాల్గనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
దీపావళి పండుగ తర్వాత సమావేశమైన నలుగురైదుగురు  సీనియర్‌ ఉద్యోగులు చేసిన ప్రతిపాదనలకు మిగితా సిబ్బంది మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న మొత్తం 14 వేల మంది ఉద్యోగులు తలా ఒక లక్ష రూపాయల చొప్పున వేసుకుంటే సులభంగా కొనుగోలు చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. 
 
పైగా, ఒక ప్రైయివేటు ఈక్విటీ సంస్థ వీరి ప్రతిపాదనకు కూడా అంగీకరించింది. ఉద్యోగులు అనుకున్నట్లుగా జరిగితే దేశంలోని కార్పొరేట్‌ సంస్థల చరిత్రలో ఇదో అద్బుతం కానుంది. కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షి మాలిక్‌ నాయకత్వంలో బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. 
 
డిసెంబర్‌ 14తో ముగిసే బిడ్డింగ్‌ ప్రక్రియలో ఎయిరిండియా అధికారులు పాల్గంటారు. డిసెంబర్‌ 28 లోపు అర్హత కలిగిన బిడ్డర్ల సమాచారాన్ని ప్రకటిస్తారు. ఉద్యోగుల నిర్వహణ కన్సార్టియం విమనయాన సంస్థలో 51 శాతం వాటా కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. మిగతా 49 శాతం వాటాను ప్రయివేటు ఈక్విటీ సంస్థలు కలిగి ఉంటాయని తెలుస్తోంది.