ఫ్రాన్స్‌లోని విజ‌య్ మాల్యా ఆస్తులు జప్తు  

పెద్ద మొత్తంలో బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టి విదేశాల‌కు ప‌రారైన కింగ్‌ఫిష‌ర్ విజ‌య్‌మాల్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నీడ‌లా వెంటాడుతున్న‌ది. ఫ్రాన్స్‌లో ఆయ‌న‌కున్న దాదాపు 1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను శుక్రవారం స్వాధీనం చేసుకున్న‌ది. 
 
ఈడీ చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఫ్రెంచ్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజ‌య్ మాల్యా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.  భారత కరెన్సీలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ .14 కోట్లు. 
 
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించ‌కుండా విజ‌య్‌మాల్యా విదేశాల‌కు పారిపోయారు. బ్యాంకులకు అసలు, వడ్డీ క‌లిపి మొత్తం రూ.9,000 కోట్లు రావాల్సి ఉంది. మాల్యాను లండ‌న్‌ నుంచి రప్పించడానికి భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న‌ది. 
 
2016 మార్చి నుంచి లండ‌న్‌లో మాల్యా నివసిస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు బెయిల్‌పై ఉన్నాడు. భార‌త్‌కు ర‌ప్పించేందుకు చట్టప‌ర‌మైన సమస్యలు ఉన్నాయ‌ని, అవ‌న్నీ ప‌రిష్కారం అయిన త‌ర్వాత‌నే మాల్యాను అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈడీ అధికారులు చెప్తున్నారు