పిన్ లేకుండా రూ 5,000 వరకు డిజిటల్ లావాదేవీలు 

డిజిటల్‌ చెల్లింపుల విషయంలో అనేక సులభతర పద్ధతులను వినియోగదార్లకు అందుబాటులోకి తేవేదం కోసం రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీలు, ఇ-మాండేట్‌ల పరిమితిని పెంచింది.
 
 ప్రస్తుతం రూ.2 వేల వరకూ చెల్లింపులు, లావాదేవీలను పిన్‌ నంబరు అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.5 వేల వరకూ పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది 2021 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. 
 
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఆర్‌టిజిఎస్‌ సేవలను కూడా ప్రతి రోజూ 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది. 
 
ఆర్‌బిఐ శుక్రవారం ద్వైపాక్షిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, జిడిపి ఇంకా ప్రతికూల స్థాయిలోనే ఉండటంతో వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి అంచనాలను -7.5 శాతానికి సవరించింది.