పీఎఫ్ఐ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో 26 చోట్ల ఈడీ సోదాలు

పీఎఫ్ఐ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో 26 చోట్ల ఈడీ సోదాలు

నిషేధిత ఇస్లామిక్‌ సంస్థ పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇవాళ 9 రాష్ట్రాల్లోని సుమారు 26 ప్ర‌దేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ సోదాలు నిర్వ‌హించింది.  పీఎఫ్ఐ చైర్మ‌న్ ఓమ్ అబ్దుల్ స‌లామ్‌తో పాటు కేర‌ళ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌షీరుద్దీన్ ఎల‌మార‌మ్ ఇండ్ల‌ల్లోనూ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హించింది. 

త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, యూపీ, బీహార్‌, మ‌హారాష్ట్ర‌, బెంగాల్‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ రాష్ట్రాల‌తో పాటు కేర‌ళ‌లోని కొన్ని జిల్లాలో ఈడీ సోదాలు జ‌రిగాయి.  మ‌నీల్యాండ‌రింగ్ జ‌రిగిన‌ట్లు ప‌లు కేసులు న‌మోదు అయిన నేప‌థ్యంలో ఈడీ ఆధారాల కోసం రంగంలోకి దిగింది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన అల్ల‌ర్ల‌కు నిధుల‌ను పీఎఫ్ఐ స‌మ‌కూర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కోణంలో ఈడీ విచార‌ణ చేప‌ట్టింది.  కేర‌ళ‌తో పాటు ఢిల్లీలో ఈ కేసుతో లింకున్న కొంద‌ర్నీ ఈడీ అధికారులు విచారించారు.

అయితే రైతుల ఆందోళ‌న‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే త‌మ‌పై దాడులు చేస్తున్న‌ట్లు అబ్దుల్ స‌లామ్ ఆరోపించారు.  2006లో పీఎఫ్ఐని కేర‌ళ‌లో ఏర్పాటు చేశారు.  దేశ రాజ‌ధానిలో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న‌ది.  పీఎఫ్ఐ, భీమ్ ఆర్మీ మ‌ధ్య అక్ర‌మ లావాదేవీలు జ‌రిగిన‌ట్లు ఈడీ త‌న ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. పీఎఫ్ఐ బ్యాంకు ఖాతాల్లో సుమారు 120 కోట్లు క్రెడిట్‌ అయిన‌ట్లు ఈడీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.