కరోనాతో గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం

కరోనా కారణంగా భారత ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష మిషన్ అయిన గగన్‌‌యాన్ ఏడాది పాటు ఆలస్యం అవ్వొచ్చునని   ఇస్రో చైర్‌‌పర్సన్ కె.కె.శివన్ తెలిపారు. వచ్చే ఏడాది ఆఖరులో లేదా తదుపరి సంవత్సరం ఈ మిషన్‌‌ను పూర్తి చేయాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివన్ చెప్పారు.
 
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్‌లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్‌‌ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది.
రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని, వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. గగన్‌యాన్ మిషన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మనుషులకి ఈ మిషన్ ప్రయోగానికి ముందు రెండు అన్‌క్రూవ్డ్ మిషన్లు చేపడుతారు.
“మేము వచ్చే ఏడాది చివరలో లేదా తర్వాతి సంవత్సరంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని శివన్  తెలిపారు. ఇతర రంగాలలో వలే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా స్పేస్ యాక్టివిటీస్ చేయలేమని స్పష్టం చేశారు. స్పేస్ ఇంజనీర్లు ల్యాబ్స్‌‌లో అందుబాటులో ఉంటేనే పని చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. లాంచింగ్ కోసం ప్రతి ఇంజనీర్, టెక్నీషియన్, టెక్ అసిస్టెంట్ ఒక దగ్గరకు చేరి కలసి కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ముగ్గురు సిబ్బందితో కూడిన వ్యోమనౌకని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO)కు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో పాటు, మిషన్ తరువాత వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్ యాన్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో గత నెలలో హెవీ లిఫ్ట్ లాంచర్, జిఎస్ఎల్వి ఎంకెఐఐఐని గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయోగించినట్లు తెలిపారు. జిఎస్ఎల్వి ఎంకెఐఐఐలో హై థ్రస్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ S200 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.