కోటి మంది ఆరోగ్య కార్య‌కర్త‌ల‌కు మొదటి వ్యాక్సిన్ 

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను మొద‌ట‌గా దేశంలోని కోటి మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్ర‌వారం జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో అన్ని పార్టీల‌కు ప్ర‌భుత్వం స‌మాచారం ఇచ్చింది. 
 
ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల త‌ర్వాత క‌రోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్లు వంటి 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. 
 
ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్స్‌ల‌కు మొద‌ట వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు ఈ ప్రెజెంటేష‌న్‌లో భాగంగా రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు. 
 
కాగా,  భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గురువారం వరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా శుక్రవారం అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ధోరణి గత వారం రోజులుగా కొనసాగుతున్నది. 
 
అంతేకాదు భారతదేశ వ్యాప్తంగా గత 24 గంటలలో కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 4,16,082 కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తహా 36,595 మందికి కోవిడ్ సోకినట్టు తేలగా, 42,916 మంది కొత్తగా కోలుకున్నారు.  ఆ విధంగా ఈ తేడా అయిన  6,321 నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలకు దోహదం చేసినట్టయింది.