మేఘాలయలో 6 వేల డిటోనేటర్ల స్వాధీనం

మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో లాండ్రింబై పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగాంగ్‌లో అసోం రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఎస్‌యూవీని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. 10 పెట్టెల్లో ఉన్న 250 కేజీల పేలుడు పదార్థాలు (2 వేల జిలెటిన్ స్టిక్స్), 1000 లైవ్ డెటోనేటర్లు, 8 ఫ్యూజ్‌వైర్ రోల్స్ లభ్యమైనట్టు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జీకే లంగ్రై తెలిపారు.

కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఖ్లీహ్రియాట్‌లో పేలుడు పదార్థాలను వాహనంలో లోడ్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

అక్కడ నిర్వహించిన తనిఖీల్లో 51 కార్టన్లలో దాదాపు 1,275 కేజీల పేలుడు పదార్థాలు (10,200 జిలెటిన్ స్టిక్స్), 5 వేల డిటోనేటర్లు, 8 ఫ్యూజ్‌వైర్ రోల్స్ పట్టుబడ్డాయి. మొత్తంగా 1,525 పేలుడు పదార్థాలు సీజ్ చేసినట్టు లంగ్రై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.