ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ఎంఆర్ఐవి’ విజయవంతంగా ప్రయోగం

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ఎంఆర్ఐవి’ విజయవంతంగా ప్రయోగం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ), ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసిబిఎం) అయిన ‘అగ్ని ఎంఆర్ఐవి’ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరానికి దూరంగా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విశాలమైన భౌగోళిక విస్తీర్ణంలో వేర్వేరు ప్రదేశాలలో ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలా, బహుళ పేలోడ్‌లతో ఈ క్షిపణిని పరీక్షించారు. 
 
ఈ పరీక్షకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పరీక్ష, డిఆర్డిఏ ఎప్పటి నుండో పనిచేస్తున్న ‘అగ్ని-6’ క్షిపణిపై చర్చను రేకెత్తించింది. ఈ క్షిపణి కార్యక్రమం ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉందని, దీనికి సంబంధించిన అవసరమైన ప్రాథమిక పనులన్నీ సంస్థ పూర్తి చేసిందని గత నెలలో డిఆర్డీఏ చైర్మన్ సమీర్ వి. కామత్ తెలిపారు. 
 
“ఇది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చిన వెంటనే, మేము పరీక్షకు సిద్ధంగా ఉంటాము,” అని నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో మాట్లాడుతూ కామత్ పేర్కొన్నారు. అగ్ని-6 క్షిపణి పరిధి సుమారు 6,000 నుండి 10,000 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నడుమ, భారతదేశ దీర్ఘ-శ్రేణి క్షిపణుల సామర్థ్యాన్ని పెంచడం, దేశం అణు నిరోధక శక్తిని  బలోపేతం చేయడం ఈ క్షిపణి ప్రధాన లక్ష్యం. 
 
ఈ క్షిపణిలో ఎంఐఆర్వి సాంకేతికతను పొందుపరిచే అవకాశం ఉంది. అంటే, ఇది ఒకేసారి అనేక అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదు. ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఒక ‘గ్లైడ్ ఆయుధ వ్యవస్థ’ తొలి ప్రయోగ పరీక్ష ఒడిశా తీరంలో విజయవంతంగా జరిగింది.  మార్గనిర్దేశం లేని వార్‌హెడ్‌లను కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలుగా మార్చడానికి ‘టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్’ (తార) వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డీఆర్డీఏ సహకారంతో, హైదరాబాద్‌లోని ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ సంస్థ ఈ వ్యవస్థను రూపొందించి అభివృద్ధి చేసింది.
 
 “భూమిపై ఉన్న లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగించే తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాల యొక్క విధ్వంసక శక్తిని, కచ్చితత్వాన్ని పెంచడం” దీని ముఖ్య ఉద్దేశం. ఈ విజయవంతమైన పరీక్షకు గాను సింగ్, ఆయా సంస్థలను అభినందించారు. “అత్యాధునిక, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థలను వినియోగించుకున్న మొట్టమొదటి గ్లైడ్ ఆయుధం ఇదే,” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.