ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర భగ్నం

ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర భగ్నం
* సామూహిక విషప్రయోగంకు కుట్ర… ముగ్గురిపై  ఛార్జిషీట్
దేశ రాజధానిలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఐఎస్ఐ’ పన్నిన భయంకరమైన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ-సోనిపట్ హైవేపై ఉన్న ప్రముఖ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఒక ప్రసిద్ధ ఆలయమే లక్ష్యంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.  జమ్మూకశ్మీర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షహజాద్ భట్ నేతృత్వంలోని మాడ్యూల్‌ను ఈ దాడుల కోసం ఐఎస్ఐ రంగంలోకి దించింది.
ఈ కుట్రపై పక్కా సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు, మెరుపు దాడులు నిర్వహించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక నిందితుడు ఢిల్లీలోని ప్రముఖ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించాడు. అక్కడి భద్రత, భక్తుల రద్దీని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు పంపాడు.
రద్దీగా ఉండే సమయాల్లో ఆలయంలోకి ప్రవేశించి, భక్తులు, భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరపాలని వీరు ప్లాన్ చేశారు.  మిలిటరీ క్యాంప్‌లతో పాటు, హైవేపై రద్దీగా ఉండే దాబాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నారు. షహజాద్ భట్ అందిస్తున్న నిధులు, ఆదేశాల మేరకే ఈ స్థానిక ముఠా సభ్యులు దాడులకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. 
కాగా, బహిరంగ ప్రదేశాలలో ప్రాణాంతకమైన జీవవిషాన్ని ఉపయోగించి సామూహిక విషప్రయోగ దాడులు జరిపేందుకు ఐసిస్ సంబంధిత కుట్రలో పాత్ర ఉన్నారనే ఆరోపణలపై, ఒక వైద్యుడితో సహా ముగ్గురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసిందని అధికారులు తెలిపారు.  హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్, మహమ్మద్ సుహెల్ అనే నిందితులపై గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
 
ఎన్ఐఏ ప్రకారం ఈ ముగ్గురూ విదేశాల్లోని ఐసిస్ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ, నిషేధిత ఆయుధాలు మరియు జీవ ఉగ్రవాదాన్ని ఉపయోగించి జిహాద్‌కు మద్దతు ఇవ్వడానికి, భయోత్పాతం సృష్టించడానికి బలహీనమైన, తీవ్రవాద భావజాలం వైపు మొగ్గుచూపే యువతను నియమించుకోవడానికి సమన్వయంతో పనిచేశారు. 
 
ఈ ఉగ్రవాద కుట్రను అమలు చేయడానికి, ఆముదం గింజల నుండి సేకరించిన అత్యంత విషపూరితమైన ‘రైసిన్’ అనే పదార్థాన్ని ఉపయోగించాలని నిందితులు ప్రణాళిక రచించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. రైసిన్ దాని ప్రాణాంతక స్వభావం కారణంగా రసాయన ఆయుధాల ఒప్పందం (కెమికల్ వెపన్స్ కన్వెన్షన్) షెడ్యూల్ I కింద వర్గీకరించబడింది.