కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం  

రాబోయే కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ ‌లైన్ వర్కర్లు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌లో తొలి ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు.
 
 లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉన్న విప‌క్ష నేత‌ల‌తో వ‌ర్చువ‌ల్ భేటీలో మాట్లాడిన మోదీ అత్యంత చౌకైన‌, సుర‌క్షిత‌మైన టీకాపై ప్ర‌పంచం దృష్టి పెట్టింద‌ని, అందుకే అంద‌రూ భారత్ పై దృష్టి పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థానంలో ఉంద‌ని చెప్పారు. 
 
వ్యాక్సిన్ ధ‌ర విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్రం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని, ప‌బ్లిక్ హెల్త్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ టీకా ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంద‌ని మోదీ వెల్ల‌డించారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ బృందాలు వ్యాక్సిన్ పంపిణీ గురించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయ‌ని తెలిపారు. 
‘ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌కు వ్యాక్సిన్ పంపిణీలో విశేషానుభవం, సామర్థ్యం ఉంది. వ్యాక్సినేషన్ రంగంలో అతిపెద్ద, అనుభవం కలిగిన నెట్‌వర్క్ ఉంది. వాటిని పూర్తిగా వినియోగించుకుంటాం’  అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యాక్సిన్ ధరలపై రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపి, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10.30 గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
 కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో ఆ పార్టీ విపక్ష నేత గులామ్ నబీ ఆజాద్,  టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్, ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్ రౌత్ తమ అభిప్రాయాలను సమావేశం దృష్టికి తెచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
దేశంలో కరోనా విజృంభించిన తర్వాత ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. కోవిడ్‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ సూచ‌ల‌ను లిఖిత‌పూర్వంగా ఇవ్వాలంటూ ప్ర‌ధాని మోదీ ఆయా పార్టీల‌ను కోరారు.  మీరిచ్చే సూచ‌న‌ల‌కు అత్యంత అధిక ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చెప్పారు.