భారత్ లో తేనెను కల్తీ చేస్తున్న  `చైనా సిరప్’ 

ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన, అత్యంత మధురమైన ఆహార పదార్ధం తేనె. ఎటువంటి పదార్ధాలు కలపకుండా సహజంగానే సేవించే పదార్ధం కూడా. భారత దేశంలో ప్రాచీనకాలం నుండి ఔషధాలలో, ఆధ్యాత్మిక క్రతువులో తేనెను ఎక్కువగా వాడుతున్నాము. 
 
ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో కలకలం సృష్టించిన కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తేనె చాలా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉండడంతో ఈ మధ్య దాని వాడకం బాగా పెరిగింది. 
 
తేనె దేశంలో ఒక పెద్ద కుటీర పరిశ్రమ కూడా. లక్షలాది కుటుంబాలు దేశ వ్యాప్తంగా తమ జీవనాధారం కోసం దీనిపై ఆధారపడి ఉన్నాయి. వారిలో ఎక్కువగా అణగారిన వర్గాలకు చెందిన వారే. కరోనా సమయంలో ఒక వంక తేనె వాడకం పెరుగుతున్నా తేనె టీగలను పెంచుకొని  అమ్ముకొనే వారి ఆదాయం మాత్రం తగ్గుతూ ఉండడం చాలామందికి విస్మయం కలిగించింది. కిలో రూ 150 వరకు ఉన్న ధర రూ 60కు కూడా పడిపోయింది.
దానితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తేనెలో పెద్దఎత్తున కల్తీ చేయడం జరుగుతున్నట్లు గ్రహించింది. ఒక విధమైన పంచదార సిరప్ ను కలుపుతున్నట్లు గ్రహించి, నిర్ణీత పరీక్షలు జరుపకుండా తేనెను అమ్మరాదని ఆంక్షలు విధించింది. భారత ఆహార రక్షణ, ప్రమాణాల సంస్థ కొన్ని ప్రమాణాలను నిర్ణయించి, వాటిని ఖచ్చితంగా పాటించాలని నుండి అమలు చేస్తున్నది. పైగా విదేశాలకు ఆగష్టు 1 నుంచి ఎగుమతి అయ్యే తేనె ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైన ఎన్ ఎం ఆర్ పరీక్షలు జరిపించాలని స్పష్టం చేసింది.
అయితే ఢిల్లీ కేంద్రంగా గల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) ఈ విషయమై జరిపిన పరిశోధనలో విస్మయకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు పట్టుబడకుండా ఉండే విధంగా చైనా నుండి ఒక విధమైన `పంచదార సిరప్’ ను దిగుమతి చేసుకొని, దేశంలోని ప్రముఖ బ్రాండ్ల వారంతా తేనెను పెద్ద ఎత్తున కల్తీ జరుపుతున్నట్లు బైటపడింది.
సిఎస్ఇ పరిశోధకులు తేనె ఉత్పత్తిదారులమంటూ చైనా కంపెనీలతో ఆన్ లైన్ లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. చైనాలో అలీబాబా వంటి ప్రముఖ కంపెనీలు అనేకం ఇటువంటి కల్తీ సిరప్ ను భారత్ కు పారిశ్రామిక ఉత్పత్తుల అవసరంకోసం అంటూ పంపుతున్నట్లు గ్రహించారు.
పైగా, తమ సిరప్ ను 80 శాతం వరకు కలిపినా భారత ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలలో పట్టుబడదని ఆన్ లైన్ మెయిల్ లో వారు తేల్చి చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త నెలకొనడంతో చైనా నుండి నేరుగా పంపితే కస్టమ్స్ వారితో ఇబ్బంది వస్తుందని హాంగ్ కాంగ్ నుండి ఒక నమూనా సిరప్ ను కూడా పంపించారు.
చైనా నుండి దిగుమతి కష్టమవుతున్నదని భారత్ లోనే కొన్ని చోట్ల ఆ సిరప్ ఉత్పత్తి ప్రారంభం కావడం కూడా కనిపెట్టారు. ఉత్తరాఖండ్ లోని జస్పూర్ లో ఆ విధంగా ఉత్పత్తి చేస్తున్న వారి నుండి కూడా నమూనా సేకరించారు.
ఈ సందర్భంగా భారత దేశంలో అమ్మకంలో ఉన్న ప్రముఖ బ్రాండ్ లతో పాటు చిన్న బ్రాండ్ లను కూడా మొత్తం 13 రకాల తేనెలను దేశంలోని ప్రముఖ ల్యాబ్ లలో పరీక్షా చేయించగా ప్రముఖ్ బ్రాండ్ లు అన్ని నాణ్యమైనవిగా తేలింది. అయితే జర్మనీ లోని ఒక ప్రముఖ ల్యాబ్ కు పంపి ఎన్ ఎం ఆర్ పరీక్షా చేయించగా వాటిల్లో మూడు తప్ప అన్ని కల్తీ అని తేలింది. ఈ విధంగా కల్తీ అని తేలిన వాటిల్లో డాబర్, బైద్యనాథ్, పతంజలి, హిమాలయ, జండూ వంటి ప్రముఖ బ్రాండ్లవి కూడా ఉన్నాయి.
ఇది తీవ్రమైన అంశమని సిఎస్ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నుండి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తీ పెంచుతుందని తేనె సేవిస్తూ ఉంటె దానిలో పంచదార సిరప్ కల్తీ అయితే శరీరంలో రోగ నిరోధక శక్తీ మరింతగా తగ్గే ప్రమాదం ఉన్నదని ఆమె హెచ్చరించారు. ఇది ప్రజారోగ్యాన్ని అవహేళన చేయడమే అంటూ స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వం ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలలో తమ కల్తీ బైట పడకుండా ఉండే విధంగా కల్తీ సిరప్ లను చైనా నుండి సరఫరా అవుతున్నదని ఆమె పేర్కొన్నారు. అందుకనే భారత ప్రభుత్వం ముందుగా చైనా నుండి అన్ని రకాల సిరప్ లు, తేనె ల దిగుమతులు నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎగుమతి చేసే తేనెకు తప్పనిసరి చేసిన ఎన్ ఎం ఆర్ పరీక్షలను దేశంలో అమ్మే తేనెలు కూడా తప్పకుండా జరిపేటట్లు చేయాలనీ ఆమె కోరారు.
వీటన్నింటికి మించి తేనె ఉత్పత్తి చేసే కంపెనీలు తాము ఎవ్వరి వద్ద నుండి, ఎంత మేరకు తేనె సేకరిస్తున్నామో వెల్లడి చేసేటట్లు చేయాలని నారాయణన్ సూచించారు. ఆ విధంగా చేయడం వల్లన తేనె ఎంత కొనుగోలు చేస్తున్నారో,  ఎంత తమ ఉత్పత్తులలో వాడుతున్నారా తెలుసుకొనే వీలు ఏర్పడుతుందని ఆమె చెప్పారు. వెంటనే తేనె కల్తీని అరికట్టడం కోసం ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.