ఒకేసారి ఎన్నికలు దేశానికి.. రాజకీయ పార్టీలకూ మంచిదే

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి జమిలి ఎన్నికలు జరపవలసిన అవసరాన్ని ప్రస్తావించడం అందుకు ఆయన సమాయత్తం అవుతున్నట్లు సంకేతం వెలువడుతున్నది. జ‌మిలి ఎన్నిక‌ల అంశంపై కేవ‌లం చ‌ర్చ మాత్ర‌మే కుద‌ర‌దు అని, ఇప్పుడు ఆ విధానం భార‌త్‌కు ఎంతో అవ‌స‌రమ‌ని ఆయ‌న పేర్కొనడం ప్రాధాన్యతను సంతరింప చేసుకొంది.
అయితే జమిలి ఎన్నికల అవసరాన్ని గుర్తు చేసిన నేతలలో ప్రధాని మోదీ మొదటివారు కాదు. గతంలో అనేకమంది నేతలు ఈ అవసరాన్ని స్పష్టం చేశారు. వాస్తవానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రెండు దశాబ్దాల కాలం పాటు జమిలి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి.
 
1951-52, 1957, 1962, 1967 లలో ఏకకాల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తర్వాత కొన్ని  శాసనసభలు రద్దవుతూ రావడంతో ఆ పక్రియ దారి మళ్లింది. బాంగ్లాదేశ్ ఆవిర్భావం కోసం జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించిన ఇందిరాగాంధీ లోక్ సభను ఒక ఏడాది ముందుగా రద్దు చేసి, 1971లో ఎన్నికలకు వెళ్లడంతో ఈ పక్రియ మొత్తంగా దారి తప్పింది.
ఆ తర్వాత కూడా పలు చట్టబద్ధ సంస్థలు జమిలి ఎన్నికల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎన్నికలు ఖరీదైనవి కావడంతో,  లా కమిషన్ తన 170 వ ఎన్నికల సంస్కరణల నివేదిక (1999)లో లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలని సిఫార్స్ చేసింది.  పరిపాలనలో స్థిరత్వం కొరకు ఈ సిఫార్స్ చేస్తున్నట్లు కమీషన్ చైర్మన్ జస్టిస్ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 
ఎన్నికలు నియమిత సమయంలో జరపడం పాలనా సౌలభ్యంకు అవసరమని ప్రపంచంలో పలు దేశాలు గుర్తించి, ఆ విధంగా వ్యవహరిస్తున్నాయి. 48 దేశాలలో, గరిష్ట సంఖ్యలో ఓటర్లు పోలింగ్ లో పాల్గొనడానికి వీలుగా ఆదివారం మాత్రమే ఎన్నికలు ఎల్లప్పుడూ జరుగుతాయి. 
 
భారతదేశంలో, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపల్ బాడీలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశంలో సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. అసెంబ్లీ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరు ఓటరు జాబితాలను రూపొందిస్తోందని, అలా రూపొందించడం అంటే వనరులను వృథా చేయడమే అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

దక్షిణాఫ్రికాలో, జాతీయ,  ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒక పర్యాయం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.  అయితే మునిసిపల్ ఎన్నికలు 2 సంవత్సరాల తరువాత నిర్ణీత తేదీన జరుగుతాయి. స్వీడన్‌లో, జాతీయ, ప్రాంతీయ శాసనసభలు, స్థానిక సంస్థలు / మునిసిపల్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్ణీత తేదీన జరుగుతాయి. అంటే ప్రతి నాలుగు ఏళ్లకు ఒక సారి సెప్టెంబర్‌లో రెండవ ఆదివారం జరుగుతాయి.

ఎన్నికైన అన్ని సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో  ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేశం లేదు. పారామిలిటరీ దళాల వినియోగం, ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది, బూత్‌లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటరు స్లిప్‌లను నిర్వహించే ఎన్నికల కమిషన్ సిబ్బంది పరంగా ఎన్నికలు నిర్వహించడానికి సమయం, ఖర్చు తగ్గుతుంది.

అలాగే, పార్టీల ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా పరిమితం చేసే అవకాశం లభిస్తుంది. వీటన్నింటికి  మించి  తక్కువగా ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ అమలులో ఉంటూ ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు స్తంభించి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు పరిపాలన పరమైన అంశాల పట్ల దృష్టి సారించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

మన దేశంలో ప్రతి ఏడాది రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభ, లోక్ సభ ఎన్నికలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలపై నిర్దుష్టంగా దృష్టి సారింపలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రాష్ట్రాలలోని సమస్యలు స్థానికమైనవి, రాష్ట్రాల పరిధికి సంబంధించినవే అయినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రజా తీర్పుగా వర్ణించే ధోరణి కూడా పెరుగుతున్నది. ఎన్నికలు కలిసి జరిగితే విలువైన డబ్బు, భారీ మానవశక్తి ఆదాతో పాటు పాలనా స్థిరత్వంకు అవకాశం ఏర్పడుతుంది. 

 
పైగా ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు  ప్రధాన ప్రచారకర్తలుగా ఉంటూ ఉంటారు. వారు ఎన్నికల వ్యూహాలతో, ప్రచారంలో తీరిక లేకుండా ఉంటూ ఉండడంతో పాలనపై అవసరమైం దృష్టి సరింపలేదు. తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండడం ఒక విధంగా పాలనాపరమైన అస్థిరత్వంకు దారితీస్తుంది.
 
అన్ని ఎన్నికలు కలిసి ఒకేసారి జరిగితే, మహోత్తరమైన ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, ముఖ్యమైన సంస్కరణలను చేపట్టడానికి ప్రభుత్వత్య్రాలకు స్పష్టమైన 58 నెలల వ్యవధి లభిస్తుంది. ఆ విధంగా చేయడంతో వారి పనితీరు ఫలితాలు స్పష్టంగా ప్రజల ముందుంటాయి. ఈ పరిస్థితులు రాజకీయ పక్రియను మరింత అర్ధవంతం కావిస్తుంది. 
 
లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే వ్యవస్థను రూపొందించడానికి సమయం ఆసన్నమైన్నట్లు 1983లోనే భారత ఎన్నికల కమీషన్ పేర్కొన్నది. 2015 లో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సహితం లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాల ఎన్నికలు నిర్వహించే అవకాశంపై నిర్దుష్టంగా సిఫార్సులు చేసింది.  అభివృద్ధి ఎజెండాలో ఇతర దేశాలతో పోటీ పడాలంటే భారతదేశానికి తరచూ ఎన్నికల నుండి ఉపశమనం ముఖ్యం అని స్టాండింగ్ కమిటీ గుర్తించింది.

“రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించడం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రత్యామ్నాయ, ఆచరణాత్మక పద్ధతి” – ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం మధ్యలో – నవంబర్ 2016 లో, కొన్ని అసెంబ్లీలకు, జూన్ 2019 చివరిలో, మిగిలిన వాటికి ఎన్నికలు జరుపవచ్చు. నిర్ణీత ఎన్నికల తేదీ నుండి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం కాలానికి ముందు లేదా తరువాత పదవీకాలం ముగిసే అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు కలిసి ఉంటాయి”.


లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే ఖర్చును ఎన్నికల సంఘం రూ 4,500 కోట్లు అని అప్పట్లో పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. అయితే ఆచరణలో అవుతున్న ఖర్చులు కమీషన్ అంచనాలకు మించి ఉంటున్నది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించని రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది.

1977 నుండి, ఎన్నికల పెరుగుతూ వస్తున్నది. 1971లో ఎన్నికల వ్యయం కేవలం రూ 11.5 కోట్లుగా ఉండగా, 1977లో రెట్టింపుకు పైగా రూ 23 కోట్లకు చేరుకొంది. అది 1980 నాటికి రెట్టింపై రూ 54 కోట్లు కాగా, 1989 నాటికి  మూడు రేట్లు పెరిగి రూ 155 కోట్లు అయింది.  రెండేళ్ల తరువాత 1991లో ఖర్చులు రూ 359 కోట్లకు పెరిగాయి. 1996 లో ఇది రూ 600 కోట్లకు చేరుకుంది.


మూడు సంవత్సరాల తరువాత, 1999 లో, ఎన్నికల కమిషన్ రూ .880 కోట్లు ఖర్చు చేసింది. 2004 నాటికి ఇది రూ 1300 కోట్ల వరకు పెరిగింది. తాత్కాలిక అంచనా ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు రూ 4500 కోట్ల ఖర్చు జరిగింది. 
 
ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చేసిన ఖర్చులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ .300 కోట్లు ఖర్చయ్యాయి. జమిలి ఎన్నికల ద్వారా ఈ విధమైన ఖర్చులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రధానమైనవి కావడంతో మనం వీటిని నివారించలేము. అయితే, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీ, మునిసిపల్ బాడీ ఎన్నికలను నిర్ణీత రోజున నిర్వహించడం ద్వారా ఎన్నికలు పదే పదే జరుగకుండా  నివారించవచ్చు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ తన సామర్థ్యాన్ని, సుముఖతను ఇప్పటికే వ్యక్తం చేసింది.

 
జమిలి ఎన్నికల ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రహకారం కోసం పెట్టె ఖర్చులు ఎన్నో రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందుచేత ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు జరపడానికి ధృఢచిత్తంతో ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.