స్వ‌దేశీయంగా యుద్ధ‌నౌక‌లు, స‌బ్‌మెరైన్ల‌ నిర్మాణం  

స్వ‌దేశీయంగా యుద్ధ‌నౌక‌లు, స‌బ్‌మెరైన్ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు నౌకాద‌ళ చీఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ తెలిపారు.  భ‌విష్య‌త్తులో నౌకాద‌ళానికి అవ‌స‌ర‌మైన యుద్ధ‌నౌక‌లు, జ‌లాంత‌ర్గాముల‌ను  స్వ‌దేశంగా నిర్మించ‌నున్నామ‌ని, దాంట్లో 41 యుద్ధ‌నౌక‌లతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ కూడా ఉన్న‌ట్లు వెల్లడించారు. 

న‌వంబ‌ర్‌లో న‌లుగురు మ‌హిళా ఆఫీస‌ర్ల‌ను ఇండియ‌న్ నేవీ నియ‌మించింద‌ని చెబుతూ మాల్దీవులు, ర‌ష్యాకు చెందిన నౌక‌ల‌పై మ‌రో ఇద్ద‌రు మ‌హిళా ఆఫీస‌ర్ల‌ను నియ‌మించిన‌ట్లు  తెలిపారు.  భార‌తీయ నౌకాద‌ళం రెండు స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని పేర్కొంటూ   కోవిడ్‌19తో పాటు వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా ద‌ళాల దురాక్ర‌మ‌ణ సాగుతున్న‌ట్లు చెప్పారు. 

అయితే ఈ రెండు స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు నౌకాద‌ళం సిద్ధంగా ఉంద‌ని క‌రంబీర్ సింగ్ స్పష్టం చేశారు.  ఒక‌వేళ భార‌త జ‌లాల్లోకి చైనా నౌక‌లు ప్ర‌వేశిస్తే, అప్పుడు వారిని అడ్డుకునేందుకు త‌మ వ‌ద్ద ప్రామాణిక‌మైన ప‌ద్ధ‌తులు ఉన్నాయ‌ని హెచ్చరించారు. లీజు తీసుకున్న రెండు ప్రిడేట‌ర్ డ్రోన్లు నిఘాను పెంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

24 గంట‌ల పాటు అవి నిఘా పెట్ట‌డం వల్ల నిఘా సామ‌ర్థ్యం పెరిగింద‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ ఆ డ్రోన్లు కావాల‌ని ఆర్మీ, వైమానిక ద‌ళం భావిస్తే,  ఆ డ్రోన్లను ఇచ్చేందుకు ప‌రిశీలిస్తామని తెలిపారు.  ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్త స‌హ‌కారంతో నౌకాద‌ళం ప‌టిష్ట‌మ‌వుతోంద‌ని, చైనాను ఎదుర్కొనేందుకు ముగ్గురం క‌లిసి ప‌నిచేస్తున్నామని వెల్లడించారు.

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అవ‌స‌రాల కోసం పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వివిధ ప్రాంతాల్లో మోహ‌రించిన‌ట్లు ఆర్మీ చీఫ్ చెప్పారు. ఉత్త‌రాది స‌రిహ‌ద్దుల్లో హీర‌న్ నిఘా డ్రోన్ల‌ను మోహ‌రించిన‌ట్లు తెలిపారు.  ప్ర‌స్తుతం హిందూ మ‌హాసముద్రంలో మూడు చైనా యుద్ధ నౌక‌లు ఉన్నాయ‌ని, యాంటీ పైర‌సీ పెట్రోలింగ్ కోసం ఈ మూడు నౌక‌లు 2008 నుంచి ఆ స‌ముద్ర జ‌లాల్లో ఉన్న‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.

యాంటీ డ్రోన్ ఎక్విప్మెంట్‌లో భాగంగా స్మాష్‌-2000 రైఫిళ్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.  డ్రోన్ల‌పై దాడి జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ రైఫిళ్ల‌ను ఖ‌రీదు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  స‌ముద్రంలో వైమానిక ద‌ళాన్ని ప‌టిష్టం చేయాల‌ని, దాని కోసం ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్లు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.  30 ప్రిడేట‌ర్ డ్రోన్ల‌ను ఖ‌రీదు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  అత్యంత సామ‌ర్థ్యం క‌లిగిన ఆ డ్రోన్ల‌ను మూడు ద‌ళాల‌కు వినియోగించ‌నున్న‌ట్లు తెలిపారు.