జనవరిలో రజనీకాంత్ కొత్త పార్టీ 

తన రాజకీయ ప్రవేశం గురించి సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఊహాగానాలను వ్యాపింప చేస్తూ వచ్చిన తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చివరకు ఈ సంవత్సరం చివరలో తాను ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ గురించిన ప్రకటన చేయగలనని ప్రకటించారు. గత ఏడాది కూడా ఇటువంటి ప్రకటన చేసి ఇప్పటి వరకు ప్రకటించాక పోవడం గమనార్హం. 
 
వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రజనీకాంత్ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. జనవరిలో పార్టీ ఏర్పాటు చేస్తాను అని, అందుకు సంబంధించిన వివరాలు – పార్టీ పేరు, సిద్ధాంతాలను డిసెంబర్ 31న ప్రకటించగలను అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ ఆయన అభిమానులలో ఆనందోత్సవాలు కలిగించింది. 
 
రజినీకాంత్ గత సోమవారం తన రజిని మక్కల్ మండ్రం ఫోరమ్ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జిల్లా ఆఫీసు బేరర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ రోజు తన పార్టీ గురించి త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజినీకాంత్ తెలిపారు. చెప్పినట్లుగానే ఆయన గురువారం తన కొత్త పార్టీ గురించి ఓ ట్వీట్ చేశారు.
 
ఇటీవల రజనీకాంత్ కు కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతోనే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు వైద్యులు సూచించినట్టు వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని రజనీ చెప్పడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బీజేపీతో కలిసి నడవాలని రజినీ కోరుకుంటే హృదయపూర్వకంగా స్వాగతిస్తామని సినీ నటి, బీజేపీ నేత కుష్బూ తెలిపారు.ఈ విషయంలో కేంద్ర అధినాయకత్వందే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు బలంగా ఉందని, రజినీ తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైతే స్వాగతిస్తామని కుష్బూ వ్యాఖ్యానించారు. అయితే  రజినీ వచ్చే ఎన్నికల్లో సొంతంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని కుష్బూ పేర్కొన్నారు.