ఫలించని రైతులతో చర్చలు… రేపు మరోసారి 

కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో జరుపుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. గురువారం ముగ్గురు కేంద్ర మంత్రులు, రైతుల ప్రతినిధులతో విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన రెండో దఫా చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండా అసంపూర్తిగా ముగిశాయి. తిరిగి శనివారం చర్చలు జరపాలని నిర్ణయించారు. 

మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ప్రతిష్టంభన నెలకొంది. అయితే చర్చల సారాంశాన్ని బట్టి చూస్తే కేంద్రం కొన్ని అంశాల విషయంలో సమీక్షకు సుముఖత వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.

చర్చలకు ముందు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌తో హోంమంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. తమ పార్టీ, ప్రభుత్వ వైఖరిని వివరించిన అమరీందర్‌ – సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరారు. పంజాబ్ ఆర్ధిక వ్యవస్థ,  దేశ భద్రతలను దృష్టిలో ఉంచుకొనే రైతుల సమస్యలు  త్వరితగతిన పరిష్కారం కావలసి ఉన్నట్లు తెలిపారు 

ఓ వైపు దేశ రాజధాని సరిహద్దులలో చలికాలపు రాత్రుల మధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు నిరసనలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. వివిధ రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలతో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్య, రైల్వే శాఖ మం త్రి పీయూష్‌ గోయెల్‌, వాణిజ్య శాఖ మంత్రి, పంజాబ్‌ ఎంపీ అయిన సోమ్‌ ప్రకాశ్‌ చర్చలు జరిపారు. సోమ్ ప్రకాష్ పంజాబ్ కు చెందిన ఎంపీ. 

ఈ మధ్యలో ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులకు భోజనం, తేనీటికి ఆహ్వానించినా వాటిని తిరస్కరించారు. తమకు సమస్యపై చర్చలు, తగు పరిష్కారం ముఖ్యమని తేల్చిచెప్పారు. అయితే రైతులు వెలిబుచ్చుతున్న అంశాలలో తలెత్తే సముచిత విషయాలపై కేంద్రం సానుకూల స్పందన ఉంటుందని ఈ సందర్భంగా మంత్రుల బృందం 40 మంది రైతుల నేతలకు తెలిపారు. 

చట్టాలలో పలు లోపాలు ఉన్నాయని, ఇవి తమకు భారంగా మారుతాయని రైతులు భావిస్తున్నట్లు కేంద్రానికి నేతలు తెలిపారు. తొలుత రైతులు తమ డిమాండ్లపై కేంద్ర మంత్రులకు వివరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, అధికారులు… రైతులు లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించారు. కొత్త చట్టాల ద్వారా కలిగే లాభాలతో పాటు ప్రైవేటు మార్కెట్లకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు మధ్య తేడా గురించి ప్రభుత్వ వర్గాలు వివరించాయి. 

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థ కొనసాగుతుందని తోమర్‌ మరోమారు స్పష్టం చేశారు. అయితే   కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడానికి ఓ చట్టం చేయాలని రైతులు ప్రతిపాదించినట్లు సమాచారం. అంతేకాక, కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారికి శిక్షలు విధించాలని, అది ఆ చట్టంలో ఉండాలని వారు కోరారు. దీనికి ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వలేదు. 

ఎంఎస్పీపై చట్టానికి బదులు లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి తోమర్‌ ప్రతిపాదించగా రైతులు అందుకు తిరస్కరించారు.   ’ఎంఎస్పీ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం గట్టిగానే అంటోంది.  ఈ చర్చల్లో కొంత పురోగతి ఉంది గానీ కొత్త చట్టాల రద్దు విషయం ఎటూ తేలలేదు. వాటిని రద్దు చేయాలని తాము డిమాండ్‌ చేస్తూంటే ప్రభు త్వం వాటిని సవరించడంపై మాట్లాడుతోంది’’ అని చర్చలు ముగిసిన తర్వాత భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాటి చెప్పారు.  

ప్రభుత్వం తరఫున బృందానికి  సారధ్యం వహించిన వ్యవసాయ మంత్రి తోమార్ ప్రస్తుతం పంటలకు ప్రకటిస్తున్న కనీస మద్ధతు ధరలను ఎలాంటి ఆటంకం కలగనివ్వబోమని ఈ సమావేశంలో పదేపదే భరోసా ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను (ఏపీఎంసీలను) పటిష్టం చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

‘‘ప్రభుత్వానికి అహం లేదు. కొత్త చట్టం వల్ల వ్యవసాయ మార్కెట్‌ విధానం రద్దవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ మార్కెట్లను మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వ సేకరణ విధానం యథావిధిగా జరుగుతుంది. ఈ చట్టాల ద్వారా రైతులకు మరిన్ని చట్టబద్ధమైన హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం. అలాగే, విద్యుత్తు చట్టంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణించి చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించారు.

అలాగే, వ్యవసాయ మార్కెట్ల బయట పంటను కొనుగోలు చేసే వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండేలా చూస్తామని తెలిపారు. ఏవైనా సమస్యలు వచ్చినపుడు సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)  కోర్టులకెళ్లాలన్నది చట్టంలో ఉందని, అయితే రైతులు ఇది మరీ దిగువస్థాయి కోర్టు అనీ, పైకోర్టులోనే తమ ఇబ్బందులు పరిష్కారమయ్యేలా నిబంధనలుండాలని అంటున్నారని, దీనినీ సానుకూలంగా పరిశీలిస్తామని తోమర్‌ చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మరో రౌండు చర్చలు జరుపుతామని, ఆ భేటీ లో ఓ అంగీకారం సాధ్యం కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రతిపాదనలు, వైఖరిపై 35 రైతు సంఘాలు శుక్రవారం సంఘూ సరిహద్దు కేంద్రం వద్ద చర్చించనున్నాయి. ఎంఎస్పీ వ్యవస్థ కొనసాగేట్లు చట్టం తేవాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గరాదని సంఘాలు భావిస్తున్నాయి. కొన్ని యూనియన్లు 5వ తేదీనాటి చర్చల్లో కూడా అంగీకారం అసాధ్యమంటూ వాటిని బహిష్కరిద్దామని చూస్తున్నాయి. తమ వైపు నుంచి అయితే చర్చల ప్రక్రియ ముగిసినట్లే అని, తమ నేతలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై భేటీకి వెళ్లకూడదని అనుకున్నట్లు ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) ప్రతినిధి ప్రతిభా షిండే తెలిపారు. లోక్‌సంఘర్ష్ మోర్చా అధ్యక్షులు కూడా అయిన ప్రతిభా షిండే మహారాష్ట్ర, గుజరాత్ రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, గురువారం నాటి చర్చలలో కేంద్రం నుంచి తమకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పి) సంబంధిత భరోసా, పంట సేకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందినట్లు మరో రైతు నేత కుల్వంత్ సింగ్ సంధూ తెలిపారు. వీటిపై తాము శుక్రవారం అంతర్గతంగా సమీక్షించుకుంటామని వివరించారు. దీని వల్ల శనివారం నాటి మరో దఫా చర్చల సందర్భంగా తమ వాదన విన్పించడానికి వీలేర్పడుతుందని సింగ్ చెప్పారు. 

కాగా, రైతుల ఆందోళనకు మద్దతుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనుకకు ఇచ్చివేస్తున్నట్లు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాష్‌సింగ్‌ బాదల్‌ ఖండించారు.