ఈసీ నిర్లక్ష్యం వల్లే పోలింగ్ శాతం తగ్గింది

ఎన్నికల  కమిషన్ నిర్లక్ష్యం కారణంగానే  జీహెచ్ఎంసీ ఎన్నిలకల్లో పోలింగ్ శాతం తగ్గిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓటర్లను భయపెట్టేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.  ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై నిరసన వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజెపి నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు జరిపిన  ఉపవాస దీక్షలను సంజయ్ నిమ్మరసం ఇచ్చి  విరమింప చేశారు.   

ఎన్నికవాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ దీక్ష చేశారని సంజయ్ చెప్పారు. ఎన్నికల సంఘం, పోలీస్ లు సీఎం కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారన్నారు. ఎన్నికలన్లో గెలిచేందుకు విచ్చల విడిగా డబ్బులు, మద్యం పంచారని ఆరోపించారు. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల పైనే కేసులు పెట్టడంతో పాటు, లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు. 

పొలింగ్ శాతం ను పెంచేందుకు ప్రయత్నం చేయాల్సిందే పోయి తగ్గించడానికి పోలీసులు, ఎన్నికల కమీషన్ కృషి చేయడంకన్నా  దుర్మార్గం మరొకటి లేదని సంజయ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారిపై దాడులకు తెగబడ్డారని దయ్యబట్టారు. 

అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు భయపడకుండా అధికారపక్షం  అన్యాయాలను అడ్డుకున్నారని కొనియాడారు. అంతేకాదు ఎక్కడా ఘర్షణలకు కూడా దిగలేదని చెప్పారు. 

ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుందని సంజయ్ ఆరోపించారు. కావాలనే టీచర్లకు సీఎం కేసీఆర్ ఎలక్షన్ డ్యూటీ వేయలేదని అంటూ వారి మీద ఆయనకు నమ్మకం లేదని చెప్పారు. అనుభవం లేని వ్యక్తులతో డ్యూటీ చేయించారన్నారు. 

అంతేకాదు  వరుసగా నాలుగు రోజులు సెలవు వచ్చేలా ముందే ప్లాన్ చేసి ఎన్నికలు పెట్టారని విమర్శించారు. సర్వేలన్నీ బీజేపీ అనుకూలంగా వచ్చాయని, ఓటమి భయంతోనే కేసీఆర్  కుటిల రాజకీయాలు చేశారని మండిపడ్డరు. ఎక్కడా లేని విధంగా ఈసారి మంత్రులే బరితెగించి డబ్బులు పంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చూసి చూడనట్టు వ్యవహరించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని సంజయ్  డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని ఆదరించారని చెబుతూ పూర్తి మెజార్టీతో గ్రేటర్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గినందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి  విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విద్వేషాలు జరుగుతాయని చెప్పడం వల్లే ఓటింగ్‌ శాతం తగ్గిందని పేర్కొన్నారు.  ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.