కేరళలో ‘సోషల్ ఇంజినీరింగ్’కు తెర లేపిన బిజెపి 

కేరళలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త ‘సోషల్ ఇంజినీరింగ్’ వ్యూహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిద్ధం చేశారు. సాధారణంగా కేరళలో క్రైస్తవ, ముస్లిం ఆధిపత్యంగా రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ రెండు ఓటు బ్యాంకులతో అటు అధికార కమ్యూనిస్టులు, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్రంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. 
 
ఈ రెండు పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి, స్థానిక సంస్థల వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు షా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 500 మంది క్రైస్తవులకు, 112 మంది ముస్లింలకు బీజేపీ టిక్కెట్లిచ్చింది. అంతేకాకుండా ప్రచారానికి యూపీ సీఎం యోగిని బరిలోకి దింపనుంది. ఇలా ఇరు వర్గాలకు చెందిన వారికి టిక్కెట్లు కేటాయించి, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలను దెబ్బకొట్టే ఎత్తుగడను అమలు చేస్తున్నారు.
 
కేరళలో 45 శాతం క్రైస్తవ, ముస్లిం జనాభా ఉంటుంది. 55 శాతం హిందువుల జనాభా. 55 శాతం హిందువుల జనాభా ఉండటం, ఆ ప్రాంతంలో ఆరెస్సెస్ అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నా బీజేపీ చెప్పుకోదగినంతగా ఎన్నికలలో విజయాలు పొందలేక పోతున్నది.  దీన్ని దృష్టిలో ఉంచుకునే సరికొత్త వ్యూహంతో బిజెపి వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. 
 
సంప్రదాయ ఓటు బ్యాంకుపై కన్నేస్తూనే, కొత్త ఓటు బ్యాంకును ‘సోషల్ ఇంజినీరింగ్’ తో బీజేపీ స్థానిక సంస్థలలో సరికొత్త ప్రయోగం చేస్తున్నది. కొత్త ఓటు బ్యాంకు, సంప్రదాయ ఓటు బ్యాంకును మిళితం చేసి మూడో స్థానానికి రావాలని అమిత్‌షా రాష్ట్ర నేతలకు టాస్క్ ఇచ్చారు. ప్రథమ స్థానంలో వామపక్షీయులు, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ ఉంది. తృతీయ స్థానానికి ఎగబాకి, మెళ్లి మెళ్లిగా ద్వితీయ స్థానానికి రావాలని షా తలపోశారని కేరళ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించి, వామపక్షాలు, కాంగ్రెస్ ను దెబ్బతీయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో సీనియర్ అయిన టాం వడక్కన్ ను బీజేపీలోకి ఆహ్వానించింది.  ఇక మరో నేత అబ్దుల్లా కుట్టి. ఈయన చాలా ఏళ్ల పాటు సీపీఎంలో పనిచేశారు. లోక్‌సభ సభ్యునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
ప్రధాని మోదీని ప్రశంసించడంతో ఆయన్ను సీపీఎం బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా మోదీని ప్రశంసించడంతో కాంగ్రెస్ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం వీరిద్దరికీ బీజేపీ అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా అబ్దుల్లా కుట్టిని, అధికార ప్రతినిధిగా టాం వడక్కన్ ను నియమించింది. 
 
ఇలా వీరిద్దర్నీ తీసుకోవడం ద్వారా స్థానిక సంస్థల్లో వీలైనంత పుంజుకోవాలని బీజేపీ నిర్ణయించిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా బీజేపీ ముస్లిం, క్రైస్తవులకు గణనీయంగా సీట్లు కేటాయించడంతో ఎస్.డి.పీ.ఐ, పీఎఫ్‌ఐ వంటి పార్టీలు హిందువులకు అత్యధికంగా సీట్లు కేటాయించవలసి వచ్చింది.