విద్యావ్యవస్థలో రిజర్వేషన్ల నిర్వీర్యం ప్రసక్తి లేదు 

విద్యావ్యవస్థలో రిజర్వేషన్ల నిర్వీర్యం ప్రసక్తి లేదు 

విద్యావ్యవస్థలో రిజర్వేషన్లను పలుచన చేసే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని, నూతన విద్యావిధానం కూడా ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తున్నదని   కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.  భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల విధానాన్నినూతన విద్యా విధానం  ఎన్.ఇ.పి.-2020ని సమర్థిస్తున్నదని ఆయన భరోసా ఇచ్చారు. 

“రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని నూతన విద్యావిధానం సమర్తిస్తున్నట్టేనా.. ? అనే సందేహాలతోఇటీవల మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో  ఆయన ఈ వివరణ ఇచ్చారు. దేశ విద్యావ్యవస్థలో రిజర్వేషన్ల నిబంధనల స్థాయిని నూతన విద్యా విధానం తగ్గిస్తుందేమో అన్న సందేహాలను ఆయన కొట్టిపారవేసారు. 

భారతీయ రాజ్యాంగంలోని 15,16 అధికరణాల్లో పొందుపరిచిన రిజర్వేషన్లను నూతన విద్యా విధానం కూడా గట్టిగా ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ నిబంధనలను గురించి కొత్తవిధానంలో ప్రత్యేకంగా పునరుద్ఘాటించవలసిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

నూతన విద్యావిధానంపై ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలు జరిగాయి. జె.ఇ.ఇ., నీట్ (ఎన్.ఇ.ఇ.టి.) యు.జి.సి.నెట్ వంటి ప్రవేశ పరీక్షలు, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష వంటి ఎన్నో పరీక్షలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల్లో పలురకాల నియామకాలను కూడా చేపట్టారు. అయితే, ఎక్కడా రిజర్వేషన్ల నిబంధనలను నీరుగార్చారనిగానీ, రిజర్వేషన్ల స్థాయిని తగ్గించారనిగానీ ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదూ అందలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 

కొత్త విద్యావిధానాన్ని ప్రకటించిన నాలుగైదు నెలల తర్వాత, ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేకుండా ఇపుడు ఇలా అనుమానాలు లేవనెత్తడం ఏమిటో నాకు అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు.  విజయవంతంగా సాగుతున్న పథకాలు, కార్యక్రమాలు, విధానాలు ఎప్పటిలాగే ముందుకు సాగుతాయని చెప్పారు. 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి, ఇతర వెనుకబడిన తరగతులకు, దివ్యాంగులకు, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలకు నోచుకోని గ్రూపులకు విద్యావ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించే కృషి గతంలోవలే కొనసాగి తీరుతుందని, ఇందుకోసం కొత్తగా మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా పరిష్కారంకోసం తన మంత్రిత్వ శాఖ అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు.  ఎన్.ఇ.పి.-2020 రూపకల్పనలో బహుముఖంగా ఎంతో కృషి జరిగిందని,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న సూత్రం మార్గదర్శకంగా ఒక ప్రజా పత్రంగా ఎన్.ఇ.పి.-2020 రూపుదాల్చిందని ఆయన పేర్కొన్నారు. 

అందువల్లనే, సమాజంలోని అన్ని వర్గాలను, గ్రూపులను కలుపుకునిపోయే నిర్ణయంతో కొత్త విధానం మన ముందుకు వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.