చందాకొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ 

మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఇఒ, ఎండి చందాకొచ్చర్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చందాకొచ్చర్‌ను సిఇఒ, ఎండి పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో తనను సిఇఒ, ఎండి పదవుల నుంచి తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ చందాకొచ్చర్‌ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఇది ప్రయివేటు బ్యాంకుకు, ఉద్యోగికి మధ్య జరిగిన ఒప్పందం పరిధిలోకి వస్తుందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.1875 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై మనీలాండరింగ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
దీంతో అప్పటికే సిఇఒ, ఎండిగా కొనసాగుతున్న చందాకొచ్చర్‌ను ఆ పదవుల నుంచి తప్పిస్తూ ఐసిఐసిఐ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో తనను సిఇఒ, ఎండి పదవుల నుంచి తప్పిస్తూ ఐసిఐసిఐ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తొలుత చందాకొచ్చర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన బాంబే హైకోర్టు ‘ఇది ప్రయివేట్‌ ఒప్పందం గనుక ఇందులో మేం జోక్యం చేసుకోబోం’ అంటూ ఈ ఏడాది మార్చి 5న ఆమె పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఇదే విషయమై చందాకొచ్చర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా, మనీలాండరింగ్‌ అభియోగాలపై దీపక్‌ కొచ్చర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇడి అరెస్టు చేసింది.