మరోసారి ల‌క్ష కోట్లు దాటిన జీఎస్టీ వ‌సూళ్లు

వ‌రుస‌గా రెండో నెల‌లోనూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వ‌సూళ్లు రూ.ల‌క్ష కోట్లు దాటాయి. న‌వంబ‌ర్ నెల‌లో మొత్తం రూ.1,04,963 కోట్లు వ‌సూలై 1.4 శాతం వార్షిక వృద్ధి న‌మోదైన‌ట్లు తాజా గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే అక్టోబ‌ర్‌తో పోలిస్తే ఈ వసూళ్లు 0.18 శాతం త‌గ్గాయి. 
 
అక్టోబ‌ర్‌లో రూ.1,05,155 కోట్లు వ‌సూల‌వ‌డం విశేషం. క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావం మొద‌లైన త‌ర్వాత ఆరు నెల‌ల పాటు మైన‌స్‌లో ఉన్న వృద్ధి గ‌త మూడు నెల‌లుగా పాజిటివ్‌లో ఉంటోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ మెల్ల‌గా పుంజుకుంటుండ‌టంతో జీఎస్టీ వ‌సూళ్లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. 
 
గ‌తేడాది నవంబ‌ర్‌లో వ‌సూలైన జీఎస్టీ కంటే ఈ ఏడాది 1.4 శాతం ఎక్కువ వ‌సూలైన‌ట్లు ఆర్థిక శాఖ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  న‌వంబ‌ర్‌లో వ‌సూలైన జీఎస్టీలో సెంట్ర‌ల్‌ జీఎస్టీ రూ.19,189 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ.25,540 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.51,992 కోట్లుగా ఉంది. న‌వంబ‌ర్‌లో సెస్ వ‌సూళ్లు కూడా 3 శాతం మేర వృద్ధి చెంది రూ.8,242 కోట్ల‌కు చేరాయి.