మమతను బలనిరూపణ కోరనున్న గవర్నర్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ కోరే అవకాశం ఉందని బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుమిత్రా ఖాన్ సంచలన విషయం వెల్లడించారు. 
 
 అసెంబ్లీలో 149 మంది సభ్యుల బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని గవర్నర్ అనూహ్యంగా కోరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కొద్ది నెలలుగా మమతాబెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ మధ్య సత్సంబంధాలు లేవు. పలు అంశాల్లో మమతతో ధన్‌కర్ విభేదిస్తున్నారు.
రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని ధన్‌కర్ నడుపుతున్నారంటూ మమత గతంలో విమర్శించగా, రాజ్‌భవన్‌పై నిఘా పెట్టారంటూ మమత సర్కార్‌పై ఇటీవల గవర్నర్ సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోవడం ద్వారా మమత సర్కార్‌కు సవాలు విసిరింది. 2021 అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇటీవల కాలంలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి  చేరుతుండటం కూడా ఆ పార్టీలో మరింత భరోసాను పెంచుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను టీఎంసీ 211 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 3 సీట్లు గెలుచుకుంది.