రైతులకు కేంద్ర మంత్రుల భరోసా 

రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం, ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధం చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు భరోసా ఇవ్వడానికి కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగారు. 

 కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రం గా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా ఐదు రోజులుగా ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు.

కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లు యథాతథంగా ఉంటాయని, నూతన చట్టాలతో వాటికెలాంటి నష్టమూ వాటిల్లదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. 

‘‘నూతన వ్యవసాయ చట్టాలను అపార్థం చేసుకోకండి. పంజాబ్ రైతులు గత సంవత్సరం కంటే వరిని మార్కెట్‌లో అధిక మద్దతు ధరకే అమ్మారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర సజీవంగానే ఉంటుంది. మార్కెట్లూ సజీవంగానే ఉంటాయి. ప్రభుత్వ సేకరణ కూడా యథాతథంగా కొనసాగుతుంది.’’ అని ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా రైతులకు భరోసా కల్పించారు. 

ఢిల్లీలో రైతుల నిరసన నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ మార్కెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయవని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులు తమ పంటలను స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.

 ‘‘నూతన వ్యసాయ చట్టాలు మార్కెట్ కమిటీలను నాశనం చేయవు. మార్కెట్ కమిటీలు యథాతథంగా కొనసాగుతాయి. రైతులు ఎక్కడైనా తమ పంటలను అమ్ముకునే వీలును నూతన చట్టాలు కల్పిస్తున్నాయి.’’ అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆదివారం అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ సమావేశమయ్యారు. ఢిల్లీ వేదికగా రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఏం చేద్దాం అన్నదానిపైనే ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ ఐదు వైపులా తాము రోడ్డును నిర్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.