కరోనాతో బీజేపీ కీలక మహిళా నేత మృతి

కరోనా వైరస్‌తో మరో బీజేపీ కీలక మహిళా నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే కన్నుమూసారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరికి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు. 
రాష్ట్రంలో అక్టోబర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఆమెకు వైరస్‌ సోకింది. మరో ఎమ్మెల్యే రాజేంద్రతో పాటు ఎన్నికల బాధ్యురాలిగా నియమితులైన మహేశ్వరీ కరోనా బారిన పడ్డారు. ఈనెల మొదటి వారం నుండి వైరస్‌తో పోరాడుతూనే ఉన్నారు.  కిరణ్ మహేశ్వరి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్ పూర్ కు తీసుకువచ్చారు.
మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 
 కిరణ్‌మహేశ్వరీ మృతి పట్ల ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు సంతాపం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె గెలుపొందారు.
2004లో ఉదరుపూర్‌ నుండి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. ఆమె మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లవుట్, అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా తదితరులు సంతాపం తెలిపారు. 
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 94 లక్షలను దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ప్రకటించింది. గత 24 గంటల్లో 38,772 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,31,692కు చేరిందని, వీటిలో 4,46,952 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 88,47,600 మందికి స్వస్థత చేకూరినట్టు పేర్కొంది. కొత్తగా 443 మంది మృతి చెందడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,37,139కు చేరింది.