బడ్జెట్ డైరెక్టర్ గా భారత సంతతి మహిళ

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ వైట్‌హౌస్‌లోని కీలక పదవులను మహిళా సభ్యులకే కేటాయించనున్నారు. ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ చీఫ్‌గా ఇండియన్‌ అమెరికన్‌ నీరా టాండన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. 
 
గతంలో ఆమె ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించారు. దీనికి ముందు మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఆరోగ్య సలహాదారుగా పనిచేశారు. అలాగే ఆర్థిక వేత్త సిసిలియా రౌజ్‌ను కౌన్సిల్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌గా నామినేట్‌ చేయాలని బైడెన్‌ యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. 
 
ఒబామా పాలనలో సీనియర్‌ అంతర్జాతీయ ఆర్ధిక సలహాదారుగా విధులు నిర్వహించిన వాలీ అడియోమోను ట్రెజరీ విభాగంలో జానెట్‌ యెల్లెన్‌ టాప్‌ డిప్యూటీగా నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జర్నల్‌ తెలిపింది. ఎకనామిక్‌ అడ్వైజర్స్‌ కౌన్సిల్‌ సభ్యులుగా జారెడ్‌ బెర్న్‌ స్టెయిన్‌, హీథర్‌ బౌషే నామినేట్‌ చేయబడనున్నట్లు తెలిపింది. మరోవైపు వైట్‌హౌస్‌ సమాచార బృందం (కమ్యూనికేషన్స్‌ టీం)లో మొత్తం మహిళలకే చోటు దక్కనుంది. 
 
ఎన్నికల్లో బైడెన్‌ ప్రచార బృందానికి డైరెక్టర్‌గా వ్యవహరించిన కేట్‌ బెడింగ్‌ వైట్‌హౌస్‌ ప్రెస్‌ టీంకి నేతృత్వం వహించనున్నారు. డెమోక్రటిక్‌ పార్టీకి సుధీర్ఘకాలంగా అధికార ప్రతినిధిగా ఉన్న జెన్‌సాకిని ప్రెస్‌ సెక్రటరీగా నియమించనున్నారు. 
 
వీరిరువురు ఒబామా హయాంలో పనిచేశారు. ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఉన్న కర్నీ జీన్‌ పియరీ బైడెన్‌కు ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొత్తం ఏడుగురు సభ్యుల బృందంలో అందరూ మహిళలే ఉండటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.