తూర్పు లడఖ్‌లో మార్కోస్ కమాండోల మోహరింపు

 విస్తరణవాదం, దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా త్రివిధ దళాలను మోహరిస్తోంది. ఇప్పటికే భారత వాయు సేనకు చెందిన గరుడ్ ఆపరేటివ్స్, భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ తూర్పు లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తాజాగా భారత నావికా దళానికి చెందిన మెరైన్ కమాండోలు (మార్కోస్)ను కూడా మోహరించింది. 

ఈ సరస్సులో కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యాధునిక పడవలను కూడా ప్రభుత్వం త్వరలో అందించబోతోంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో మార్కోస్‌ను భారత్ మోహరించింది. ఈ ప్రాంతంలోనే భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల నుంచి ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సరస్సులో కార్యకలాపాలకు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలకు అదనంగా కొత్తగా అత్యాధునిక పడవలను భారత ప్రభుత్వం త్వరలో సమకూర్చబోతోంది.

భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ సహా స్పెషల్ ఫోర్సెస్, కేబినెట్ సెక్రటేరియట్‌కు చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ చాలా కాలం నుంచి ఈస్టర్న్ లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 

తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారత వాయు సేనకు చెందిన గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కొండల పైభాగానికి చేరుకుని, శత్రువుల విమానాలు భారత దేశ గగనతలంలోకి ప్రవేశించకుండా రక్షణ కల్పిస్తున్నాయి. 

ఈ ఏడాది ఆగస్టు 29-30 మధ్య రాత్రి కొండ పైభాగాలకు భారత సైన్యం చేరుకుంది. దీంతో చైనా సైన్యం ఈ ప్రాంతాలను ఆక్రమించకుండా నిరోధించింది.