కేసీఆర్ కు కౌంట్‌‌డౌన్‌‌ స్టార్ట్‌‌    

కేసీఆర్​కు కౌంట్‌‌డౌన్‌‌ స్టార్ట్‌‌  అయిందని, అందుకే ఆయన గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్ముతున్నట్లు కేసీఆర్‌ అబద్ధాలు చెప్తున్నారని, కేసీఆరే ఏటా హైదరాబాద్‌ చుట్టుపక్కలా రూ. 10 వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని సంజయ్​ ఆరోపించారు. 

కేసీఆర్‌వి తుపాకీ రాముని మాటలని, గత మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చి ఉంటే వాటిని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తరించిన పార్టీ అని.. టీఆర్‌ఎస్‌ గల్లీ పార్టీ కూడా కాదు గడీల పార్టీ అని ఎద్దేవా చేశారు. 

కేంద్రం వరద సాయం ఇవ్వలేదని కేసీఆర్​ అనడం సరికాదని అంటూ వరద నష్టం అంచనాలను  ఇంతవరకు ఎందుకు కేంద్రానికి పంపలేదో చెప్పాలని నిలదీశారు. ఆరున్నర లక్షల మందికి వరద సాయం చేస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎందుకు ధైర్యంగా ప్రజలకు ఆ విషయం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. 

బహిరంగ సభలో కేసీఆర్‌ సంస్కారహీనంగా మాట్లాడారని, తెలంగాణ మహిళలను కించ పరిచేలా ‘‘మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే’’ అని వ్యాఖ్యానించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని సంజయ్​ డిమాండ్‌ చేశారు.  ఎంఐఎం ఆధిపత్యం చెలాయిస్తోంది కాబట్టే పాతబస్తీలో ఇంటిపన్ను, నల్లా బిల్లు కడుతలేరని ఆరోపించారు.

‘‘మేయర్‌ సీటును ఎంఐఎం పార్టీకి ఇవ్వాలని టీఆర్​ఎస్​ చూస్తోంది. ఇదే విషయం మేం మొదటి నుంచీ చెప్తున్నాం. అందుకే ప్రచార సభలో మేయర్‌ అంశాన్ని కేసీఆర్‌ ప్రస్తావించలేదు. మేం చెప్పింది నిజం కాకుంటే ఎన్నికల షెడ్యూల్​కు ముందు ఒవైసీ  ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లారో చెప్పాలి” అంటూ సంజయ్ నిలదీశారు. 

ఎంఐఎంతో సంబంధం లేకుంటే పాత బస్తీలో  పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.  మేయర్‌ ఎంఐఎంకు ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలోనూ ఎంఐఎం భాగస్వామి కాబోతున్నదని, దీంతో రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాబోతున్నారని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నరని సంజయ్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌ ప్రశాంతంగా లేదని, అంబర్‌పేట్‌ వరకు ఎంఐఎం విస్తరించిందని, అక్కడి నుంచి హిందువులను వెళ్లగొడుతున్నారని సంజయ్ ఆరోపించారు. 

రానున్న రోజుల్లో మిగతా సిటీకి విస్తరించాలని ఎంఐఎం చూస్తోందని తెలిపారు. ప్రశాంతమైన భాగ్యనగరం బీజేపీతోనే సాధ్యమని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే సంఘ విద్రోహ శక్తులు తోకముడిచి పారిపోతాయని తేల్చి చెప్పారు. 

హైదరాబాద్‌లో విధ్వంసం జరుగుతుందనే పక్కా సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని కేసీఆర్​ను బండి సంజయ్​ ప్రశ్నించారు. కేసీఆర్‌ నిజమైన హిందువు అయితే భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు ఎందుకు రాలేదని నిలదీశారు. ప్రజలు దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టారని.. జీహెచ్‌ఎంసీ ప్రజలు నషం, జెండూబామ్‌, రోకలిబండతో తరమి కొట్టడానికి రెడీగా ఉన్నారని సంజయ్ స్పష్టం చేసారు.