మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి పేర్ని నాని అనుచరులు నిందితుడిని పట్టుకోవడం ప్రమాదం తప్పింది. 
 
మంత్రిని కలవడానికి అని వచ్చిన ఓ వ్యక్తి ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. దండం పెడుతూ ఒక్కసారిగా తాపీని తీసి మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే అనుచరులు వెంటనే అడ్డుకోవడంతో మంత్రి పేర్ని నాని సురక్షితంగా బయటపడ్డారు. 
 
నిందితుడిని పట్టుకున్న మంత్రి అనుచరులు అతడిని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. మంత్రి నివాసంలోనే దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది.
 
ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ రోజు మా తల్లిగారి పెద్దకర్మ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. పూజలన్నీ పూర్తి చేసుకుని భోజనాల దగ్గరకు వెళ్తున్నా. మా ఇంటివద్దకు ప్రజలు చాలామంది వచ్చారు. వారందరినీ పలకరిస్తూ గేటు దగ్గరకు వచ్చా” అని తెలిపారు. 

 అక్కడ ఒకతను తల వంచుకుని కాళ్లకు దండం పెట్టడానికి వస్తున్నట్లుగా ముందుకు వచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే ఐరన్‌ది ఏదో పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు. అయితే మొదటి సారి విఫలం అవడంతో రెండో సారి పొడవడానికి ప్రయత్నిస్తుంటే తన చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి పట్టుకున్నారని మంత్రి వివరించారు. 

అతను ఎందుకిలా చేశాడో తనకు తెలీదని చెబుతూ తానైతే సురక్షితంగా ఉన్నానని చెప్పారు. అతను బలరాం పేటకు సంబంధించిన వ్యక్తి. నేను గుర్తు పట్టానని,  గన్‌మెన్లు అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారని తెలిపారు. తనకు ఏమీ కాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.