నివర్‌ తుపాను పరిహారంకు నిబంధనల అడ్డు 

ఏపీలో లక్షలాది ఎకరాలలో పంటలకు నష్టం కలిగించిన  నివర్‌ తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయానికి నిబంధనలు అడ్డొస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
డిసెంబర్‌ 15 కల్లా నష్టాలపై ఎన్యుమరేషన్‌ పూర్తి చేసి ప్రతిపాదనలు పంపితే, నెలాఖరుకు రైతులకు పరిహారం అందిస్తామని శుక్రవారంనాటి కేబినెట్‌ చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  అయితే ‘నివర్‌’ కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ సర్కారు ఇచ్చే పెట్టుబడి రాయితీ అందే అవకాశం లేదని తెలుస్తోంది.
 
ఒక సీజన్‌లో ఎన్ని తడవలు విపత్తులు సంభవించినప్పటికీ ఒక రైతుకు ఒక విపత్తుకు మాత్రమే పరిహారం అందుతుందని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ‘నివర్‌’ పంట నష్టాలను నమోదు చేసే క్షేత్ర స్థాయి అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. 
 
ఈ నిబంధన అమలైతే లక్షలాది మంది రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు.  ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వరుసగా పంట నష్టాలు సంభవించాయి.  ఏ సీజన్‌లో నష్టాలకు ఆ సీజన్‌లోనే పరిహారం అన్న సర్కారు, ఆ మేరకు విడతల వారీగా ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసింది.
 
ప్రస్తుత నివర్‌ తుపాన్‌ 11 జిల్లాలపై తన ప్రభావం చూపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో వరి, పత్తి పంటలకు నష్టం కలిగించింది. కోసిన పంటలు తడిసిపోవడంతో నష్టం అధికంగా ఉంది. 
 
దాదాపు 3 లక్షల హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సర్వే పూర్తయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎన్యుమరేషన్‌ దగ్గరకొచ్చే సరికి సమస్య వచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఒకసారి పంట నష్ట పరిహారానికి అర్హత సాధించిన రైతుల పంటలు మళ్లీ ‘నివర్‌’కు సైతం దెబ్బతింటే, అలాంటి వారికి పరిహారం అందదని చెబుతు న్నారు.
కేంద్రానికి చెందిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌, రాష్ట్రానికి చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిబంధనలు రెండోసారి పంట నష్టానికి పరిహారాన్ని అంగీకరించట్లేదు. రైతులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు సడలించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.